భారత కమ్యూనిస్టు పార్టీని 1920లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యాలోని తాష్కెంట్లో ఎం.ఎన్.రాయ్, అబనీ ముఖర్జీ, మహ్మద్అలీ, మహ్మద్ షఫీలు స్థాపించారు. 1922లో తన రాజకీయ కార్యాలయాన్ని ఎం.ఎన్.రాయ్ బెర్లిన్‌కు మార్చాడు. భారతదేశానికి చెందిన నళినీసేన్ గుప్తా, షౌకత్ ఉస్మాని, ఎస్.ఎ.డాంగే, ముజఫర్ అహ్మద్ తదితరులు ఎం.ఎన్.రాయ్‌తో సంబంధాలు పెట్టుకున్నారు.
భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం అనేది జాతీయోద్యమ మూలం నుంచే ఉద్భవించింది. దేశంలో కమ్యూనిస్టు భావాలు కలిగిన సంస్థలన్నీ 1925, డిసెంబర్ 26న కాన్పూర్‌లో కలిసి అఖిల భారత స్థాయిలో భారత కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. దీనికి మొదటి అధ్యక్షుడిగా సింగారవేలు చెట్టియార్, మొదటి జనరల్ సెక్రటరీగా ఎస్.వి.ఘాటే వ్యవహరించారు. భారతదేశంలో కాలానుగుణంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలు వామపక్ష పార్టీలుగా కొనసాగాయి. భారత కమ్యూనిస్టు ఉద్యమ వికాసాన్ని నాలుగు దశలుగా విభజించవచ్చు.
మొదటి దశ(1920–28)
1925లో కాన్పూర్‌లో జరిగిన భారత కమ్యూనిస్టు సదస్సు కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి నాంది అని 1959లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నది. 1925లో బెంగాల్లో ముజఫర్ అహ్మద్, నజ్రుల్ ఇస్లాం, హేమంత కుమార్ సర్కార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో భాగంగా లేబర్ స్వరాజ్ పార్టీని ప్రారంభించారు. 1926లో ఇంగ్లండ్ నుంచి వచ్చిన ఫిలిప్ స్ప్రాట్ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. 1928లో వర్కర్స్ అండ్ పీసెంట్ పార్టీ ఏర్పడింది. 1927లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ గాంధీని బూర్జువా నాయకుడిగా అభివర్ణించింది. 1928లో కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ లేదా థర్డ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు బూర్జువా వర్గం అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్నది.
రెండో దశ(1929–34)
1934, ఏప్రిల్ 3న కమ్యూనిస్టు పార్టీ నాయకులు జౌళి కార్మికులతో సమ్మె చేయించారు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. ఈ కారణంగా నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
మూడో దశ (1934–40)
1935లో సి.పి.జోషి (పురన్ చంద్ జోషి) ఆధ్వర్యంలో పార్టీని పునర్ వ్యవస్థీకరించారు. ఏడో కామిన్టెర్న్ 1935, జులైలో జరిగింది. ఈ దశలో నిషేధం ఉండటంతో కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్‌లోకి ప్రవేశించే విధానాన్ని అవలంబించారు. కమ్యూనిస్టులను జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలోని కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలోకి, సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని లెఫ్ట్ కన్సాలిడేషన్ కమిటీలోకి ఆహ్వానించారు. కమ్యూనిస్టులను 1940లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ, లెఫ్ట్ కన్సాలిడేషన్ కమిటీ నుంచి బహిష్కరించారు. 1938లో ప్రోగ్రెసివ్ రైట్స్ అసోసియేషన్ ఏర్పడింది. 1940లో ఐఎన్‌సీ రామ్ నగర్ సదస్సులో సీపీఐ నివేదించిన మార్గం కార్మిక మార్గం.
నాలుగో దశ (1941–47)
1942, జులై 24న సీపీఐపై నిషేధం ఎత్తివేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, రష్యాలు ఒకే కూటమిలో ఉండటంతో రష్యా కోరిక మేరకు బ్రిటన్ను కమ్యూనిస్టు నాయకులు సమర్థించారు. ఫాసిస్ట్ అక్షరాజ్యాలు సోషలిస్ట్ ఫాదర్లాండ్పై దాడి చేయడం వల్ల యుద్ధం ప్రజా పోరాటంగా మారిందనే కారణాన్ని చూపి కమ్యూనిస్టులు బ్రిటన్‌కు మద్దతు ఇచ్చారు. కమ్యూనిస్టులు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించడంతో వారి పార్టీ ప్రతిష్ట దిగజారింది. 1945లో కేంద్ర శాసన సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఒక సీటును కూడా గెలువలేకపోయింది.
ప్రచురించిన పత్రాలు
సామ్రాజ్య వ్యతిరేక ప్రజా సంఘటన(1936): దీన్ని పామె దత్, బ్రాడ్లీ ప్రచురించారు.
గాంధీ వర్సెస్ లెనిన్(1921): ఈ డాక్యుమెంట్‌ను శ్రీపాద్ అమృత్ డాంగే ప్రచురించారు. ఇది మొదటి మార్క్సిస్ట్ బుక్ లెట్.
కుట్ర కేసులు
కాన్పూర్ బోల్ష్విక్ కుట్ర కేసు (1924, ఫిబ్రవరి)
భారతదేశాన్ని సామ్రాజ్యవాద బ్రిటన్ నుంచి విప్లవ పంథాలో వేరు చేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన వారిపై ఈ కేసు మోపారు. ఈ కేసు వల్లనే భారత్‌లో కమ్యూనిజం పరిచయమైంది. నిందితులు ఎం.ఎన్.రాయ్(ఈయన్ని 1931, జులైలో అరెస్టు చేశారు. 1932 నుంచి 12ఏండ్లు జైలుశిక్ష అనుభవించారు. అప్పీలు చేసుకోవడం వల్ల 1936లో విడుదల అయ్యారు), నళినీగుప్తా, ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మానీ, ఎస్ఏ డాంగే, సింగారవేలు, గులాం హుస్సేన్.
మీరట్ కుట్ర కేసు (1929, మార్చి)
కామిన్టెర్న్ ప్రోద్బలంతో దేశదేశాల్లో అలజడులు, సమ్మెలు జరిపి అస్థిరతను సృష్టించి, విప్లవాలు జరిపి తద్వారా ప్రభుత్వాలను కూలదోసి కార్మిక పబ్లిక్లను ఏర్పర్చడానికి కుట్ర పన్నుతున్నారన్నదే కేసు. ఈ కేసులో భాగంగా 31 మంది కార్మిక నాయకులను బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ కుట్ర కేసు విచారణ గురించి జవహర్ లాల్ నెహ్రూ మీరట్ కుట్ర కేసు కార్మికోద్యమంపై బ్రిటీష్ వారు ఆరంభించిన తొలిదశ దాడిగా అభివర్ణించారు.
బ్రిటీష్ కమ్యూనిస్టులు
భారతదేశంలో కార్మిక సంఘాల్లో వామపక్ష వర్గాన్ని రూపొందించడానికి వచ్చిన వ్యక్తి జార్జి ఎల్జిన్. ఈయన్ని నకిలీ పాస్పోర్టుతో వచ్చాడనే అభియోగంతో దేశం నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన ఫిలిప్ స్ప్రాట్, బెంజమిన్ ఫ్రాన్సిస్, బ్రాడ్లీలు కార్మిక కర్షక పక్షాన్ని ఏర్పాటు చేశారు.
ప్రజా భద్రతా బిల్లు
అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థ తరఫున ప్రచారం చేయడానికి భారతదేశానికి వచ్చిన విదేశీయులను నిర్బంధంగా దేశం నుంచి పంపించి వేయడానికి చట్టపరమైన అధికారాన్ని పొందడానికి ప్రభుత్వం ప్రజా భద్రతా బిల్లును రూపొందించింది. ప్రజా భద్రతా బిల్లు భారత జాతీయవాదం, భారత జాతీయ కాంగ్రెస్‌పైన బ్రిటీష్ వారి ప్రత్యక్ష దాడి అని మోతీలాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు. భారతదేశంలోని పెట్టుబడిదారుల ప్రతినిధులు పురుషోత్తమ్‌దాస్, ఠాకూర్‌దాస్, ఘనశ్యామ్‌దాస్ బిర్లాలు సైతం ఈ బిల్లును వ్యతిరేకించారు.
కమ్యూనిస్టులకు సంబంధించిన పత్రికలు/ జర్నల్స్
- సోషలిస్ట్: ఎస్.ఎ.డాంగే
- నవయుగ్, లంగల్: ముజఫర్ అహ్మద్
- బెంగాల్: నూరుల్ ఇస్లాం
- ఇంక్విలాబ్: గులామ్ హుస్సేన్
- లేబర్ కిసాన్ గెజిట్: సింగారవేలు చెట్టియార్
- వాన్గార్డ్: మానవేంద్రనాథ్‌రాయ్
- ది మాసెస్ ఆఫ్ ఇండియా: ఎం.ఎన్.రాయ్
- నేషనల్ ఫ్రంట్: పి.సి.జోషి
- కీర్తి: సోహన్ సింగ్ జోష్