టీడీపీతో కామ్రేడ్ల దోస్తీ కటీఫ్..!

టీడీపీకి, కమ్యూనిస్ట్ పార్టీలకు మధ్య ఎన్నో ఏళ్లుగా అవినాభావ సంబంధం కొనసాగుతోంది. పార్టీ సిద్ధాంతాలను సైతం పక్కన పెట్టి రాష్ట్ర స్థాయి కమ్యూనిస్ట్ నేతలు చంద్రబాబుతో అంటకాగుతూ వచ్చారు, ఒకరకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు టీడీపీకి బీ టీం గా పనిచేస్తున్నాయా అన్న అనుమానం వచ్చేది. అయితే, 2024 ఎన్నికల సాక్షిగా ఆ ఫెవికాల్ బంధానికి తెర పడింది.సీపీఐ, సీపీఎం లతో ఇండియా కూటమి పొత్తును ఏపీపీసీసీ చీఫ్ షర్మిల అధికారికంగా ప్రకటించటమే ఇందుకు నిదర్శనం. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు జనసేనతో జతకట్టి బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుండగా, కమ్యూనిస్టులు ఇండియా కూటమిలో చేరి బీజేపీని గద్దె దించేందుకు సిద్ధమవుతున్నారు.

కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తును అధికారికంగా ప్రకటించిన షర్మిల 26న అనంతపూర్ లో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సభకు కమ్యూనిస్టులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కలిసి పోరాడకుంటే రాష్ట్రంలో వైసీపీని, కేంద్రంలో బీజేపీని ఓడించలేమని అన్నారు. రామభక్తులమని చెప్పుకునే బీజేపీ నేతలు తిరుపతి పుణ్యక్షేత్రం సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. మరి, నామమాత్రపు ఓట్ షేర్ కూడా లేని కమ్యూనిస్టులతో పొత్తు వల్ల కాంగ్రెస్ ఏ మేరకు లాభపడుతుందో వేచి చూడాలి.