ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: కమ్యూనిస్టుల వెంట ప్రజలు లేరని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, బీజెపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గీతామూర్తిచెప్పారు. శుక్రవారం బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ దేశంలో, రాష్ర్టంలో బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీతోనైనా కలుస్తామని కమ్యూనిస్టులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎం పొత్తు ఎందుకు పెట్టుకున్నారనేది అందరికీ తెలిసిందేనన్నారు. బీఆర్ఎస్ అంటే బొంకుడు, బీర్లు, బార్ల పార్టీ అని ఎద్దేవా చేశారు. 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని 34,600 బూత్‌లలో మహా బూత్ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, దేవకీ వాసుదేవరావు, గెంటేల విద్యాసాగర్, రుద్ర ప్రదీప్ పాల్గొన్నారు.
కారేపల్లి: మండలకేంద్రంలో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్రాల ఇన్చార్జీల సమావేశంలో మాజీ ఎంపీ ధారావత్ రవీందర్ నాయక్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ లీడర్లు శ్యాంసుందర్ నాయక్, తురక నారాయణ, నాగేశ్వరరావు, సుజాత, ధారావత్ వినోద్ పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్: మండలంలోని నాయుడుపేట బైపాస్‌రోడ్‌లోని టీవీఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగే పాలేరు అసెంబ్లీ పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనాన్ని సక్సెస్ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వేంకటేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. నున్న రవి, మేక సంతోష్ రెడ్డి, నూకల రామ్మోహన్ రెడ్డి, ఎల్లారావు గౌడ్, బట్టు నాగరాజు పాల్గొన్నారు.
స్వర్ణ కవచధారిగా రామయ్య
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం స్వర్ణ కవచాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి స్వామికి గర్భగుడిలో సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. తర్వాత బంగారు కవచాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి కుంకుమార్చన నిర్వహించారు. మహిళలకు మంజీరాలు పంపిణీ చేశారు. లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, విష్ణు సహస్ర పారాయణం చేశారు. శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం జరపించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. దర్బారు సేవ అనంతరం శ్రీసీతారాములను తిరువీధి సేవగా తాతగుడి సెంటర్‌కు తీసుకెళ్లారు. గోవిందరాజస్వామి ఆలయం గోవింద మండపంలో స్వామికి రాపత్ సేవ జరిగింది. పూజలందుకున్న స్వామి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. స్వామికి సంధ్యాహారతి ఇచ్చారు.
ఆపరేషన్ స్మైల్ తో బాలల సంరక్షణ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రామ్‌తో బాలల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ డాక్టర్ వినీత్ చెప్పారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్‌లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 14 ఏండ్ల లోపు వయసు పిల్లలు పనిలో ఉండకుండా చూడాలన్నారు. వివిధ కారణాలతో అణచివేతకు గురవుతున్న బాలలను సంరక్షించేందుకు అవసరమైన సిబ్బందితో పాటు సౌలతులు కల్పిస్తామని తెలిపారు. డీసీఆర్బీ డీఎస్పీ నందీరాం, షీ టీమ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమాదేవి, డీడబ్ల్యూవో లెనీనా స్వర్ణలత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ అంబేద్కర్, సాదిక్ పాషా, సుమిత్రా దేవి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హరికుమారి, లీగల్ ఆఫీసర్ శివకుమారి పాల్గొన్నారు.
మోడీ చేసిందేమీ లేదు
ఖమ్మం/ ఖమ్మం రూరల్/ కూసుమంచి, తల్లాడ, వెలుగు: నరేంద్ర మోడీ ఓ ఫెయిల్యూర్ ప్రధానమంత్రి అని, ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశాన్ని ఉద్ధరించిందేమీ లేదని ఆర్అండ్ బీ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కూసుమంచి మండలం ఈశ్వరమాధారంలో రూ.15 కోట్లతో భగత్ వీడు, -మద్దివారిగూడెం రోడ్డు, హై లెవెల్ వంతెన, రాజుపేట- పెరికసింగారం రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత ఖమ్మం రూరల్ మండలంలో రూ.33 కోట్లతో నిర్మించనున్న దానవాయిగూడెం,- దారేడు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. తల్లాడలో రూ.9 కోట్లతో నిర్మిస్తున్న తల్లాడ, మల్లారం, గంగదేవిపాడు రోడ్డు నిర్మాణ పనులకు, కల్లూరు మండలం చెన్నూరులో రూ.6 కోట్లతో రంగాపురం-, చెన్నూరు మెయిన్ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.50 ఉండగా, ఇప్పుడు అది రూ.83కు చేరిందని విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఆప్పుడు రూ.1100కు చేరిందని, డీజిల్ రేటు రూ.40 నుంచి రూ.100 కు చేరిందని, పెట్రోల్ ధర రూ.50 నుంచి రూ.110కి చేరిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పేదలకు వివిధ స్కీముల ద్వారా డబ్బులు అందేలా చేస్తుంటే, నిత్యావసరాల ధరలు పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని అక్కా చెల్లెళ్ల ఇంట్లో నుంచి నెలకు రూ.4000 తీసుకుపోతుందని ఆరోపించారు. నేరుగా కేసీఆర్‌తో కొట్లాడటం చేతకాక రాష్ట్రంలో బీజేపీ కుట్రలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ సీఎం కాకపోతే ఇలాంటి పథకాలు రాష్ట్రంలో ఉంటాయా అని అన్నారు. ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం మేయర్ పూనకొల్లు నీరజ పాల్గొన్నారు.
రోడ్లు, భవనాలకు రూ.20 వేల కోట్లు
రాష్ట్రంలో రోడ్లు, భవనాలు, బ్రిడ్జీల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కూసుమంచి మండలం రాజుపేటలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ హైవే రోడ్ల విస్తీర్ణం 2500 కిలో మీటర్ల నుంచి 4500 పెంచామన్నారు. సచివాలయం, పోలీసు కమాండింగ్ కంట్రోల్ రూమ్ ప్రపంచంలోనే మరెక్కడా లేవన్నారు. 8 ఏండ్లలో 1.30 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్లింగ్‌ల నిర్మాణం చేపట్టిందన్నారు. ఆర్అండ్బీ శాఖలో 472 పోస్టులు భర్తీ చేశామన్నారు.
ధాన్యం కొనకుంటే ఆమరణ దీక్ష చేస్తా
వేంసూరు, వెలుగు: కాంటా వేసిన ధాన్యాన్ని కొనకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి నంబూరి రామలింగేశ్వరావు హెచ్చరించారు. మండలంలోని కందుకూరు, దుద్దేపూడి, భరనిపాడు గ్రామాల్లో కొనుగోలు సెంటర్లలో లక్ష బస్తాల వరకు వడ్లను కాంటా వేసి నెల రోజులు గడుస్తున్నా మిల్లర్లు తీసుకెళ్లకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తరుగు పేరుతో 10 కేజీల వరకు కోత విధించి కొంటామని చెబుతూ రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కలెక్టర్ స్పందించి వడ్లు కొనుగోలు చేసేలా చూడాలని, లేదంటే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. పర్సా రాంబాబు, వీరం రాజు, చల్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు.
ఇల్లందులో సీపీఐ జెండా ఎగరాలి
ఇల్లందు, వెలుగు: రానున్న ఎన్నికల్లో ఇల్లందులో సీపీఐ జెండా ఎగరేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన సీపీఐ జనరల్ బాడీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 45 నియోజకవర్గాలపై కమ్యూనిస్టు పార్టీ గురి పెట్టిందని తెలిపారు. ప్రజా సమస్యలపై భవిష్యత్ కార్యక్రమాలను రూపొందిస్తూ పోరాటాలను సాగించాలని సూచించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంత్ రావు, జిల్లా కార్యదర్శులు షాబీర్ పాషా, పోటు ప్రసాద్, విజయ సారథి రెడ్డి, మిర్యాల రంగయ్య, కె సారయ్య, దేవరకొండ శంకర్, బందం నాగయ్య పాల్గొన్నారు.
సీఎం గిరివికాస్ యూనిట్లు పంపిణీ
భద్రాచలం, వెలుగు: సీఎం గిరివికాస్ యూనిట్లను శుక్రవారం ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అశ్వాపురం, దుమ్ముగూడెం మండలాలకు చెందిన 11 మంది గిరిజన రైతులకు బోరు మోటార్లను అందించారు. అనంతరం నాయక్‌పోడు గిరిజనులు సంప్రదాయ కళాఖండాలను తయారు చేసే కేంద్రాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తరుపున వచ్చే నిధులను వీటి తయారీకి అందజేస్తామన్నారు. అనంతరం యూనిట్ ఆఫీసర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి గిరిజనులకు అందిస్తున్న స్కీంలపై రివ్యూ చేశారు.