
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే కేరళకు చెందిన ఎం.కె.వెల్లోడిని హైదరాబాద్‌కు పౌర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే, 1952 ఫిబ్రవరిలో దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. దీంతో హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు పడ్డాయి. హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉండేవి. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, మరఠ్వాడలో ఔరంగాబాద్, పర్బని, నాందేడ్, ఉస్మానాబాద్, బీరార్, కన్నడలో బీదర్, గుల్బర్గా, రాయచూర్ జిల్లాలు ఉండేవి.
16 జిల్లాల్లో 142 అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. వీటిలో 33 ద్విసభ్య నియోజకవర్గాలు. అంటే ఈ 33 స్థానాల్లో ఒక జనరల్ ప్రతినిధితోపాటు మరో రిజర్వు ప్రతినిధి కూడా ఎన్నికవుతాడు. ఈ విధంగా 142 నియోజకవర్గాలు, అదనంగా 33 మంది రిజర్వు అభ్యర్థులు కలిపి మొత్తం 175 మంది శాసనసభ్యులు హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికయ్యారు.
హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ప్రధానంగా ఐదు పార్టీలు పాల్గొన్నాయి.
1. కాంగ్రెస్ (93 సీట్లు గెలుచుకుంది)
2. పీపుల్స్ డెమొక్రటిక్ ఫెడరేషన్ (42 సీట్లు గెలుచుకుంది)
3. పీజెంట్స్, వర్కర్స్ పార్టీ (10 సీట్లు గెలుచుకుంది)
4. సోషలిస్ట్ పార్టీ (11 సీట్లు గెలుచుకుంది)
5. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ (5 సీట్లు గెలుచుకుంది)
6. స్వతంత్రులు (14 సీట్లు గెలుచుకున్నారు )
ఎన్నికల్లో పాల్గొన్న జాతీయ పార్టీలు
ఆల్ ఇండియా భారతీయ జనసంఘ్, అఖిల భారతీయ హిందూ మహాసభ, భారత జాతీయ కాంగ్రెస్, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, అఖిల భారతీయ రామ్ రాజ్య పరిషత్, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్, సోషలిస్టు పార్టీ
ప్రాంతీయ పార్టీలు
హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్, హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీ, ఇండిపెండెంట్ లీగ్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, ఆల్ ఇండియా రిపబ్లికన్ పార్టీ, యునైటుడ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్
హైదరాబాద్ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 90,21,680 కాగా 52,02,214 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమ్యూనిస్టులు తెలంగాణలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు సాధించారు. మరఠ్వాడ, కన్నడ ప్రాంతాల్లో పెద్దగా విజయాలు సాధించలేకపోయారు. రావి నారాయణరెడ్డి నల్లగొండ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో జయసూర్య, పెండ్యాల రాఘరావులు కూడా పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికయ్యారు. వీరు కూడా అసెంబ్లీ స్థానాలకు రాజీనామాలు చేశారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించింది. అయితే అప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు జరిగింది. చివరికి బూర్గుల రామకృష్ణారావు కాంగ్రెస్ శాసనసభ నాయకుడిగా ఎన్నికయ్యాడు. హైదరాబాద్ రాజ్ ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1952 మార్చి 6న కింగ్ కోఠిలోని తన నివాసంలో బూర్గుల రామకృష్ణారావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.
బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం
బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి
బిందు దిగంబరరావు హోం మంత్రి
జి.ఎస్.మెల్కోటే ఆర్థిక మంత్రి
అన్నారావు గనముఖి స్థానిక పాలన
మర్రి చెన్నారెడ్డి పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ
దేవిసింగ్ చౌహాన్ గ్రామీణాభివృద్ధి శాఖ
పూల్‌చంద్ గాంధీ విద్య, ఆరోగ్యం
సి.జగన్నాథరావు న్యాయశాఖ
నవాజ్‌జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్
శంకర్ డియో సోషల్ సర్వీసెస్
వి.బి.రాజు కార్మిక, ప్రణాళిక, సమాచారశాఖ
కొండా వెంటకరంగారెడ్డి ఎక్సైజ్, కస్టమ్స్, అటవీశాఖ
కొరటికర్ వినాయకరావు పరిశ్రమలు, వాణిజ్యం
ప్రతిపక్ష నాయకుడు వి.డి.దేశ్‌ముఖ్ పాండే (మరఠ్వాడ)
ప్రతిపక్ష పార్టీ కమ్యూనిస్టు/ పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్
హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్ కాశీనాథరావు వైద్య
డిప్యూటీ స్పీకర్ పంపనగౌడ్ సక్రిప్ప