కేసీఆర్​లో కారల్ మార్క్స్ ఆత్మను వెతుక్కుంటున్న కమ్యూనిస్టులు

మునుగోడు ఉప ఎన్నిక పుణ్యమా అని మరోసారి పాత సామాన్లు దులిపి వాడినట్లు కమ్యూనిస్టు పార్టీలను కేసీఆర్ కదిలించారు. దాంతో వారు రోజూ ఇచ్చే స్టేట్​మెంట్లు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. డి. రాజా, సీతారాం ఏచూరి మొదలుకొని నారాయణ, వీరభద్రం వరకు మతతత్వంపై పోరాటం, లౌకికవాద పరిరక్షణ అంటూ ధర్మపన్నాలు వల్లిస్తారు. అసలు 
లౌకికవాదం అనే పదాన్ని బూతుపదంగా మార్చిందే మార్క్సిస్టులు. కేవలం హిందూ మతోన్మాదానికి మాత్రమే వ్యతిరేకం అని స్పష్టంగా చెప్పరు. కేరళలో ముస్లిం లీగ్ తో అంటకాగుతారు. పీఎఫ్, ఎస్ఎపీఐలను ప్రోత్సహిస్తారు. మొన్నటివరకు అసదుద్దీన్ ఒవైసీని గట్టిగా సమర్థించారు. ఎందరినో బలిగొన్న యాకుబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తారు. అజ్మల్ కసబ్, అఫ్జల్ గురుకు, యాసిన్ మాలిక్​కు మద్దతుగా మానవ హక్కులంటూ ప్రచారం చేస్తారు. కశ్మీరును తమ గుప్పెట్లో పెట్టుకున్న ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలకు కొమ్ము కాస్తారు. 370 ఆర్టికల్ రద్దును వ్యతిరేకిస్తారు. పండిట్ల ఊచకోతపై మౌనంగా ఉంటారు. మనదేశంలోని ముస్లింలకు సంబంధం లేని సీఏఏను వ్యతిరేకిస్తూ షాహీన్‌‌ బాగ్ లో ప్రధానపాత్ర పోషిస్తారు. ఢిల్లీ అల్లర్లలో భాగస్వాములైన వ్యక్తులు, షర్జిల్ ఇమాం లాంటి దేశ ద్రోహులకు మద్దతుగా మాట్లాడతారు. జేఎన్​యూ, ఓయూ, జాదవ్​పూర్​వర్సిటీల్లో దేశ వ్యతిరేక చర్యలను సమర్థిస్తారు. ఈ దేశానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు యాక్టివిస్టులు అంతర్జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాస్తారు. ఇవన్నీ కమ్యూనిస్టుల ఇటీవలి కొత్త చారిత్రక తప్పిదాలు. స్వాతంత్ర్యోద్యమంలో రష్యా పాటలకు డ్యాన్స్ చేస్తూ బ్రిటిషు వారికి ఎలా అడుగులకు మడుగులు వత్తారో, జిన్నాకు సాయం చేసి బహిరంగంగా దేశ విభజనను ఎలా సమర్థించారో తెలిసిందే. ఇలా వీళ్ల చారిత్రక తప్పిదాల లిస్టు తీస్తే కొండవీటి చాంతాడంత అవుతుంది.

భారతీయ మూలతత్వాన్ని అర్థం చేసుకోలేక..

కమ్యూనిస్టుల ఓ వర్గం ఎమర్జెన్సీని సమర్థించింది. చైనా దురాక్రమణనూ సమర్థించి పాపం మూట కట్టుకున్నారు. ఇంకొందరు నెహ్రూ, ఇందిరా హయాంలో కాంగ్రెస్​లో చేరి ఆ పార్టీని సర్వనాశనం చేశారు. కృష్ణమీనన్ నుంచి చిదంబరం వరకు అదే బాపతు అన్న విషయం చాలామందికి తెలియదు. అకాడమీలు, మేథోరంగాలు, పత్రికారంగం కబ్జా చేసి అందులో ఈ రోజుకూ తమ ఎర్ర కలంతో విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇక కొన్నాళ్లు చంద్రబాబుతో, మరికొన్నాళ్లు కాంగ్రెస్ తో, ఓసారి పవన్ కళ్యాణ్ తో, ఇపుడు కేసీఆర్ తో తమ తోకను తగిలించి పబ్బం గడుపుకుంటున్నారు. పైస్థాయిలో నాయకుల ఈ అవకాశవాదం వల్ల కిందిస్థాయిలో కమ్యూనిస్టు కార్యకర్తల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు విధ్వంసం అయ్యాయి. మావోయిస్టు పార్టీ కూడా ఏం తక్కువ తినలేదు. వరవరరావు, హరగోపాల్, గద్దర్ ఎప్పుడూ హైదరాబాదు వదల్లేదు. కానీ అడవుల పాలైన బీసీ, ఎస్సీ, ఆదివాసీ బిడ్డలు వీళ్ల పాటలు, మాటలు నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ ఈ సోకాల్డ్ మేధావుల పిల్లలు, బంధువులు ప్రొఫెసర్లుగా, పాత్రికేయులుగా, రచయితలుగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. మారోజు వీరన్న వంటి బహుజన బిడ్డలు వీళ్ల దాష్టీకాలకు బలిపశువులయ్యారు. మానవతారాయ్ వంటి గొప్ప తత్వవేత్తలు నిర్మించిన కమ్యూనిస్టు పార్టీ అవకాశవాదంతో ‘భారతీయ’ మూలతత్వాన్ని అర్థం చేసుకోలేక వేస్తున్న పిల్లిమొగ్గలు ఆశ్చర్యం కన్నా జాలిని కలిగిస్తున్నాయి.

తోక పార్టీలుగా..

భారతదేశంలోనూ నియంతృత్వం ఉందని, దేశ ప్రధానిని కాల్చి పారేయాలని నారాయణ లాంటి వాళ్లు స్టేట్​మెంట్లు ఇస్తారు. సిద్ధాంతపరంగా ఒక తార్కిక, బౌద్ధిక దృక్పథంతో పనిచేయాల్సిన కమ్యూనిస్టులు భారతదేశంలో ఇప్పుడు అవశేషంగా మిగిలారు. నంబూద్రిపాద్, శ్రీపాద అమృత డాంగే, పుచ్చలపల్లి సుందరయ్య వంటి తొలితరం కమ్యూనిస్టు నాయకుల్లో మొదలైన ఈ అవకాశవాద రాజకీయాలు ఇప్పుడు నారాయణ, వీరభద్రం రూపాల్లో పతాక స్థాయికి చేరుకున్నాయి. 1935–-45 దశకంలో ఆంధ్రాలో ఒక ప్రజా ఉద్యమం లాగ పుట్టి పుచ్చలపల్లి సుందరయ్య వంటి కాంగ్రెస్ సోషలిస్ట్ వర్గం మూకుమ్మడిగా కమ్యూనిస్టు పార్టీలో చేరింది. మాకినేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొల్లా వెంకయ్య వంటివాళ్ల మార్గంలో ఆనాడు ముగ్గుల్లో ఆడవాళ్ల సుత్తీ-కొడవలి గుర్తును వేశారంటే ఆ పార్టీ ఎంత బలంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో మద్రాస్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు 62 స్థానాలు గెలిచారు. హైదరాబాద్ స్టేట్ లో “పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్’’ పేరుమీద కమ్యూనిస్టులు ఘనవిజయం సాధించారు. నల్లగొండ జిల్లాలోని 14 స్థానాలు గెలిచారు. ఎంపీగా గెలిచిన రావి నారాయణరెడ్డికి నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయంటే ఇప్పుడు మనం నమ్మలేం. అలాంటి కమ్యూనిస్టులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే తోక పార్టీలుగా, జాకీలుగా ఎందుకు మారిపోయారు? వాళ్లకు మార్క్స్, మావో అర్థం అవుతారు కానీ ఇక్కడి పోతులూరి వీరబ్రహ్మం, దున్న ఇద్దాసు అర్థం కారు. వియత్నాం, చెకోస్లోవేకియాలోని అధికార మార్పిడి చరిత్ర అవగాహన చేసుకున్న మార్క్సిస్టులకు ఇక్కడి భాగ్యరెడ్డి వర్మ, రమణ మహర్షి అర్థం కారు. మార్క్స్, కృశ్చేవ్​ల చరిత్రను ఔపోశన పట్టిన ఎర్రన్నలకు లోహియా, అంబేద్కర్లు అర్థం కావడం లేదు. రెడ్ గార్డ్స్, పీపుల్స్ ఆర్మీల చరిత్రను పిండి పిప్పి చేసిన మార్క్సిస్టులకు ఇక్కడి గణేశ్ చతుర్థి, ఇంటిముందు ముగ్గుల చరిత్ర అస్సలు తెలియదు. ఆఖరుకు మొన్న మొన్న గుడ్డులోంచి పుడుతున్న పవన్ కళ్యాణ్ కూడా వందేండ్ల వృద్ధాప్యంలోకి వెళుతున్న కమ్యూనిస్టులకు చేగువేరాలా కన్పించాడు. ఇప్పుడు కేసీఆర్ లో కారల్ మార్క్స్ ఆత్మను వెతుక్కుంటున్నారు. వాళ్లకు అవకాశం వచ్చినప్పుడు కేసీఆర్‌‌ను నియంత అంటారు. దశలవారీ, అంశాలవారీ మద్దతు అంటూ వారి స్వప్రయోజనాలకు తప్ప దేశ ప్రయోజనాలకు వారి నిఘంటువులో చోటే ఇయ్యరు. ‘భారతీయ కమ్యూనిస్టులు’గా పేరు పెట్టుకుని ‘భారత వ్యతిరేక కమ్యూనిస్టులు’గా మిగిలిపోతున్నారు.

మునుగోడులో ఓట్లు..

ఇప్పుడు మునుగోడులో ఉన్న గుప్పెడు ఓట్లను అటూ ఇటూ పోనియ్యొద్దని కేసీఆర్ తన రాజకీయ వ్యూహంతో విసిరిన వలలో పడిన కమ్యూనిస్టులు మునుగోడు సభలో పక్కన కూర్చోబెట్టుకుంటే ఉబ్బితబ్బిబ్బైపోయారు. సూది, దబ్బడంతో గతంలో పోల్చిన కేసీఆర్, గతంలో బెంగాల్ లో కమ్యూనిస్టు పార్టీల భయానికి జనం ఇండ్లకు సున్నం వేసుకోవాలంటే భయపడ్డారు అని చెప్పిన విషయం తాజా వార్తాంశమే. ప్రజల ఫ్రాంచైజీతో ఏర్పడ్డ ఓ టీవీ చానెల్ ను ఎందుకు అమ్ముకున్నారో తెలియదు. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన హత్య ఆరోపణలపై ఈ రోజుకూ తమ్మినేని వీరభద్రం సరైన సమాధానం చెప్పలేదు. 

నిప్పులకే చెదలు పట్టిస్తున్న ఎర్రన్నల గెంతులకు కిందిస్థాయి కార్యకర్తలు ఏమీ అనలేకపోతున్నారు. ఒకర్ని దించడం, ఇంకొకర్ని గద్దెనెక్కించడం తప్ప ఈ కమ్యూనిస్టులకు  మరొకటి చేతకాదు. ‘అరాచకత్వం సృష్టించడమే కమ్యూనిస్టుల ప్రధాన లక్ష్యం’ అన్న జోసెఫ్ స్టాలిన్ మాటలు భారత కమ్యూనిస్టులు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.  ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లాంటి పదాలు వాడే కమ్యూనిస్టులు నిజానికి నియంతృత్వాన్నే ఇష్టపడతారంటే అతిశయోక్తి కాదు. 

- డా.పి. భాస్కరయోగి, సోషల్​ ఎనలిస్ట్​