శాంతియుత సమాజ స్థాపనకు కమ్యూనిటీ పెద్దలు చొరవ చూపాలి: హైకోర్టు చీఫ్​ జస్టిస్​ సుజోయ్ పాల్ వ్యాఖ్య

శాంతియుత సమాజ స్థాపనకు కమ్యూనిటీ పెద్దలు చొరవ చూపాలి: హైకోర్టు చీఫ్​ జస్టిస్​ సుజోయ్ పాల్ వ్యాఖ్య

హనుమకొండ, వెలుగు:  వ్యక్తులు, వ్యవస్థల మధ్య తలెత్తిన వివాదాలను కమ్యూనిటీ పెద్దలు పరిష్కరించి శాంతియుత సమాజ స్థాపనకు చొరవ తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​సుజోయ్ పాల్​సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్లకు శుక్రవారం వరంగల్​డీసీసీబీ కాన్ఫరెన్స్​హాలులో నిర్వహించే మూడు రోజుల శిక్షణ తరగతులకు ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై ప్రారంభించి మాట్లాడారు. 

ఏ వివాదమైనా ఇద్దరు వ్యక్తులు, రెండు గ్రూపుల మధ్య ఏర్పడుతుందని, వారంతా ఏదో ఒక సామాజికవర్గానికి చెందినవారై ఉంటారని, అదే కమ్యూనిటీ పెద్దలు నచ్చజెబితే వివాదాలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచన నుంచే కమ్యూనిటీ మీడియేషన్​ పుట్టిందని, తొలిసారిగా కేరళలో సక్సెస్ అయిందని, అక్కడ వేల కేసులను కోర్టు దాకా తీసుకురాకుండా కమ్యూనిటీ పెద్దలే పరిష్కరించారని గుర్తుచేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్​లోనూ కూడా ఇదే విధానం అమలైందని తెలిపారు. ఇలాంటి విధానానికి 2023లో చట్టబద్ధత వచ్చిందన్నారు. 

కొన్నేండ్లుగా భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య తగాదాలు పెరుగుతున్నాయని, వాటన్నింటికీ కమ్యూనిటీ మీడియేషన్​చక్కటి పరిష్కార వేదిక అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 7న కామారెడ్డిలో 12 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్.పంచాక్షరి తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్​లో కమ్యూనిటీ మీడియేషన్​వలంటీర్లు విజయవంతంగా పని చేస్తున్నారన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బీవీ నిర్మల గీతాంబ, సీహెచ్​రమేశ్​బాబు, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్​పాండే తదితరులు పాల్గొన్నారు.