అట్రాసిటీ కేసు పెట్టాలని ఎస్పీకి వినతి

అట్రాసిటీ కేసు పెట్టాలని ఎస్పీకి వినతి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: గిరిజనుడైన కలెక్టర్  రవినాయక్ పై అసభ్యకరంగా మాట్లాడిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలని కోరుతూ గిరిజన సంఘం నాయకులు బుధవారం ఎస్పీ కె.నరసింహకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు జిల్లాకేంద్రంలో అనిరుధ్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విస్లావత్ చందర్, జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్, గిరిజన విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్  మాట్లాడుతూ కలెక్టర్ పై అనుచిత కామెంట్స్​ చేసిన అనిరుధ్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్  పార్టీ నుంచి సస్పెండ్  చేయాలని డిమాండ్ చేశారు. భగవాన్ నాయక్, రాజునాయాక్, నరసింహనాయక్, రాజునాయక్, లింబ్యానాయక్, లక్ష్మణ్ నాయక్, తులసీరాం నాయక్, జాన్యనాయక్  పాల్గొన్నారు. 

తప్పుగా మాట్లాడితే క్షమాపణకు రెడీ 

బాలానగర్: నియోజకవర్గంలో కాంగ్రెస్  పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాహిత పాదయాత్రలో బాలానగర్ లో మాట్లాడిన మాటలకు బహిరంగంగా క్షమాపణ చెప్పేందుకు తాను రెడీగా ఉన్నానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​రెడ్డి తెలిపారు. ముందుగా బాలానగర్  తహసీల్దార్ ఆఫీస్​ ముందు ప్రభుత్వ స్ధలంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని కూల్చివేయాలని డిమాండ్  చేశారు. గతంలో ఈ నిర్మాణాలపై కలెక్టర్  రొనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారని, అయినా మండల ఆఫీసర్లు అక్రమార్కులకు అండగా నిలవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణలతో పాటు బాలానగర్  పెద్ద చెరువు నాలాలను పూడ్చి వేసిన వారిపై చర్యలు తీసుకున్న వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని 
తెలిపారు.