గణేశుని లడ్డూ వేలం బాలాపూర్లో మొదలై రాష్ట్రం మొత్తం విస్తరించింది. ప్రతి ఏడాది వేలంపాట పెరుగుతూనే ఉంది. గణేశుని మండపంలో నిష్ఠతో పూజలు చేసి ఆరాధిస్తుంటారు. ప్రతి మండపంలో ఈ లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయడం ఆనవాయితీగా మారింది. చాలామంది భక్తులు వేలంపాటలో పాల్గొని పోటీ పడి ఎక్కువ ధరకి తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తారు. నిష్ఠలతో పూజలు అందుకున్న లడ్డూ తీసుకుంటే మంచి జరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకం బలంగా ఉండటంవలన లడ్డూలకి అంత ప్రాముఖ్యత వచ్చింది.
కానీ, ఎంతోమంది వేలంలో పాల్గొన్నా ఒకరికే లడ్డూ దక్కుతుంది. వేలంలో పాల్గొన్న మిగిలినవాళ్ళకి నిరాశ మిగిలిస్తుంది. లడ్డూ దక్కలేదు అని బాధపడేవాళ్లు ఉన్నారు. వాళ్ళ అందరి నిరాశను, బాధను తొలగించే ప్రయత్నంలో భాగంగా అందరి కోసం స్కై ఫౌండేషన్ సూచనలు చేస్తోంది. వేలంపాటలో పాల్గొనే ప్రతి ఒక్కరు ఎదో ఒక కోరికతో మనస్సులో తలచుకొని వేలం పాటలో పాల్గొంటారు. వేలంపాట మీకు దక్కలేదని నిరాశ చెందకుండా మీరు ఎంతవరకు వేలంపాట పాడారో అంతే డబ్బును ప్రభుత్వ పాఠశాలలు, మీకు దగ్గర్లో ఉన్న అనాథ శరణాలయాలు, నిస్వార్థంగా సేవలు అందించే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం పేదప్రజలకోసం అమలు చేస్తున్న పథకాలకు విరాళంగా అందించండి.
నిరుపేద కుటుంబాలతో చిరు వ్యాపారాలను పెట్టించి వారి జీవితాలలో వెలుగులు నింపండి. వేలంపాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తే వేలమందికి సహాయం చేసినవాళ్లు అవుతారు. మీరు చేసే సహాయానికి, సహాయం పొందినవాళ్లు మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తారు. ఆ దీవెనలు మీరు మనస్సులో కోరుకున్న కోరిక నేరవేరేందుకు ఉపకరిస్తుంది. మీకు నలుగురికి మంచి చేశాను అనే సంతృప్తి మిగులుతుంది. ఎందరికో మీరు ఆదర్శంగా నిలుస్తారు. మీ వంతుగా సమాజసేవ చేసినట్టు ఉంటుంది. మంచి మార్పుకు నాంది పలకండి.