ఒమిక్రాన్​ కమ్యూనిటీ స్ప్రెడ్​ మొదలైంది

న్యూఢిల్లీ: మొన్నమొన్నటిదాకా వేరే దేశాల నుంచి వచ్చినోళ్ల ద్వారానే అంటుకున్న కరోనా కొత్త వేరియంట్​ఒమిక్రాన్​.. ఇప్పుడు జనాల మధ్యలోకి చొరబడిపోయింది. దేశంలో కమ్యూనిటీ స్ప్రెడ్​ మొదలైపోయిందని మన దేశ కరోనా జీనోమిక్స్​ కన్సార్టియం(ఇన్సాకాగ్​) ప్రకటించింది. చాలా సిటీలు, మెట్రోల్లో దాని కేసులే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఆదివారం విడుదల చేసిన తాజా బులెటిన్​లో ఈ వివరాలను వెల్లడించింది. జనవరి 10న తయారుచేసిన ఆ నివేదికను ఇప్పుడు విడుదల చేసింది. ప్రస్తుతం ఒమిక్రాన్​ కేసులే ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి ఎస్​ జీన్​ను బేస్​ చేసుకుని చేసే టెస్టులతో(యాంటీ జెన్) లాభం ఉండదని చెప్పింది. దానివల్ల తప్పుడు నెగెటివ్​లు వస్తాయని తెలిపింది. పీసీఆర్​ టెస్టులే చేయాలని సూచించింది. తాజాగా బి.1.640.2 వేరియంట్​ను గుర్తించారని, దానివల్ల ప్రస్తుతానికి ముప్పేమీలేదని, మన దేశంలో ఆ కేసులు నమోదు కాలేదని ఇన్సాకాగ్​ పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ, డిపార్ట్​మెంట్​ ఆఫ్​ బయోటెక్నాలజీతో పాటు మరో 38 ప్రభుత్వ లేబొరేటరీలతో కరోనా వేరియంట్లపై ఏర్పాటు చేసిన గ్రూపే ఈ ఇన్సాకాగ్​. 

యాక్టివ్​ కేసులు ఎక్కువైతున్నయ్​
దేశంలో వరుసగా నాలుగోరోజూ  3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం 3,33,533 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 92 లక్షల 37 వేల 264కు పెరిగింది. కేసులతో పాటే యాక్టివ్​ కేసులూ దేశంలో ఎక్కువైపోతున్నాయి. ఒక్కరోజులోనే యాక్టివ్​ కేసులు 73,840 పెరిగాయి. పెరిగిన వాటితో కలుపుకుని ప్రస్తుతం దేశంలో 21,87,205 పాజిటివ్​ కేసులున్నాయి. వీక్లీ పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరుగుతోంది. పోయిన వారం 16.87 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ఈ వారం 17.78 శాతంగా నమోదైంది. కరోనాతో మరో 525 మంది చనిపోగా మొత్తం మరణాలు 4,89,409కి పెరిగాయి. చనిపోయినోళ్లలో 70 శాతం మంది వేరే జబ్బులతో బాధపడిన వాళ్లే ఉన్నారు. ఇప్పటిదాకా 3 కోట్ల 65 లక్షల 60 వేల 560 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 161.92 కోట్ల వ్యాక్సిన్​ డోసులు వేశారు. కాగా, దేశంలో ప్రస్తుతం కరోనా సోకే రేటు (ఆర్​ వాల్యూ– ఒకరి నుంచి ఎంత మందికి అంటుకుంటుందని చెప్పే విలువ) తగ్గిందని ఐఐటీ మద్రాస్​ వెల్లడించింది. జనవరి 14 నుంచి 21 మధ్య కరోనా ఆర్​ వాల్యూ  1.57గా నమోదైందని చెప్పింది. అదే అంతకుముందు వారం 2.2గా ఉందని తెలిపింది. అయితే, వచ్చే వారం ఆర్​ వాల్యూ పీక్​కు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.