- అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కోలతో ప్రభుత్వ ఒప్పందం
బిజినెస్‌డెస్క్, వెలుగు: దేశంలోని రైతుల ఆదాయాలు పెంచేందుకు తీసుకుంటున్న చొరవలో భాగంగా టెక్నాలజీ విరివిగా వాడేందుకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి పెద్ద కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. టెక్నాలజీతో వ్యవసాయం తీరు తెన్నులు మార్చాలని, ప్రొడక్టివిటీ పెంచాలని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆశిస్తోంది. అమెరికాకి చెందిన పెద్ద కంపెనీలతోపాటు మన దేశంలోని మరి కొన్ని కంపెనీలు సైతం ఇందులో భాగమవుతున్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించిన డేటాను ఇచ్చి, పుచ్చుకునేందుకు ఈ అగ్రిమెంట్లు వీలు కల్పించనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఇవి కార్యరూపంలోకి రానున్నాయి. రైతులకు ప్రైవేటు రంగం ఎక్కువగా సాయపడాలనేది ప్రభుత్వ ఆలోచన. రైతులకు దిగుబడి పెంచుకునేలా యాప్స్, టూల్స్ వంటివి తెస్తే వారికి ప్రయోజనం కలుగుతుందనేది ప్లాన్. పంట దిగుబడి, భూసారం, ఎవరికెంత భూమి ఉందనే వివరాలను యాప్స్, టూల్స్ ద్వారా సేకరించడంతోపాటు, సమయానుకూలంగా రైతులకు సూచనలు, సలహాలను కూడా ఇవ్వడం టెక్నాలజీతో వీలవుతుంది.
జియో, ఐటీసీ కూడా...
అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి యూఎస్‌లోని పెద్ద టెక్నాలజీ కంపెనీలతోపాటు మన దేశంలోని రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్, ఐటీసీలు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 130 కోట్ల దేశ జనాభాలో సగం మందికి ఉపాధి కల్పిస్తున్నది ఇప్పటికీ వ్యవసాయ రంగమే. ఎకానమీలో అయిదో వంతు వ్యవసాయ రంగం నుంచే మన దేశానికి వస్తోంది. రూరల్ ఏరియాలలోని ప్రజల ఆదాయాలు పెరగడానికి, దిగుమతులు తగ్గించేందుకు, ఫుడ్ వేస్టేజ్ అరికట్టడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడానికి ......ఆ తర్వాత దశలో బ్రెజిల్, యూఎస్, యూరోపియన్ దేశాలతో ఎగుమతులలో పోటీ పడేందుకు ఈ టెక్నాలజీ ప్రాజెక్టును వాడుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
1.77 లక్షల కోట్లకు అగ్రిటెక్ ఇండస్ట్రీ...
2025 నాటికి మన అగ్రిటెక్ ఇండస్ట్రీ 24 బిలియన్ డాలర్లు (రూ. 1.77 లక్షల కోట్లు)కి చేరుతుందని ఎర్న్స్ట్ అండ్ యంగ్ అంచనా వేస్తోంది. ఈ ఇండస్ట్రీ ఇప్పటిదాకా కేవలం ఒక శాతానికే అందుబాటులోకి వచ్చింది. నెట్‌వర్క్‌ల ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త టెక్నాలజీలను వాడుకలోకి తేవడానికి పెద్ద కంపెనీలకు మన దేశం ఒక ఛాన్స్ కల్పిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా నిలకడగా ఉండేలా చూసుకునేందుకు అమెజాన్, రిలయన్స్ వంటి కంపెనీలకు వీలు కలిగిస్తుంది. ఏటా మన దేశీయులు 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 74 లక్షల కోట్లు) రిటెయిల్గా ఖర్చు చేస్తున్నారు. ఇందులో సగం గ్రోసరీలపైనే వెచ్చిస్తున్నారు.
చిన్న కంపెనీలు సైతం...
అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి విదేశీ కంపెనీలతోపాటు, రిలయన్స్, ఐటీసీ వంటి మన దేశ కంపెనీలు సైతం ఇప్పటికే పైలట్ ప్రోగ్రామ్స్‌ను మొదలు పెట్టాయి. ఏడాదిపాటు ఈ పైలట్ ప్రోగ్రామ్స్‌ను అమలుచేయనున్నారు. మైక్రోసాఫ్ట్ 100 ఊర్లలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలతో ఒక ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తోంది. మరోవైపు అమెజాన్ తన మొబైల్ యాప్ ద్వారా రైతులకు ఇప్పటికే రియల్ టైమ్ సలహాలు ఇస్తోంది. ఈ పెద్ద కంపెనీలతో పాటు చాలా చిన్న కంపెనీలు కూడా ఇప్పుడు అగ్రిటెక్ ఇండస్ట్రీలో భాగమవ్వాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెసయితే జాతీయ స్థాయిలో ఎగ్రికల్చర్ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది.
పొలం నుంచి నోటికి (ఫార్మ్ టూ ఫోర్క్)...
పొలంలో పంట సాగు దగ్గర నుంచి ఆహార పదార్ధాలుగా అవి మారే ప్రతి దశకూ టెక్నాలజీ సొల్యూషన్స్‌ను డెవలప్ చేసి, అవసరమైన రీతిలో రైతులకు ఈ పెద్ద కంపెనీలు అందించాలనేది ఒప్పందంలోని నిబంధన. ఈ సొల్యూషన్స్ బెనిఫిట్ కలిగించే విధంగా ఉంటే ప్రభుత్వానికి లేదా నేరుగా రైతులకు ఆ టెక్నాలజీ సర్వీసెస్‌ను కంపెనీలు అమ్ముకోవచ్చు. దేశమంతటికీ పనికొచ్చేలా ఈ సొల్యూషన్స్‌ను స్కేల్ అప్ చేస్తారు. ఇప్పటిదాకా ప్రభుత్వం 12 కోట్ల ల్యాండ్ హోల్డింగ్స్‌కు చెందిన 5 కోట్ల మంది రైతుల డేటాను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. స్టార్ అగ్రిబజార్ టెక్నాలజీ, ఈఎస్ఆర్ఐ ఇండియా టెక్నాలజీస్, పతంజలి ఆర్గానిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, నింజా కార్ట్ వంటి లోకల్ కంపెనీలు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కానీ, సక్సెస్ కావడానికి ఇంకా టైము పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో పెద్ద కంపెనీలకు ఈ అవకాశం కట్టబెట్టడంపై దేశంలో విమర్శలు వస్తున్నాయి.
అసలు ఐడియా ఏమిటి....
పంటల సాగు, భూసారం, ఇన్సూరెన్స్, క్రెడిట్, వాతావరణ మార్పులు వంటి అన్ని విషయాలనూ ఒకే డేటాబేస్‌లోకి తెచ్చి, ఏఐ, డేటా ఎనలిటిక్స్ సాయంతో ఆ డేటాను విశ్లేషించాలనేదే ఐడియా. ఆ తర్వాత దిగుబడి పెంచుకునేందుకు, నీటి నిర్వహణ, భూసారం తగ్గిపోవడం వంటి అంశాలపై రైతులకు వ్యక్తిగత సేవలు అందించడం రెండో దశ. టెంపరేచర్ నియంత్రించే వేర్‌హౌస్‌లు, రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దేశంలో చాలా తక్కువ.
ఈ అగ్రిటెక్ ఇండస్ట్రీ చాలా ప్రభావవంతమైనది. దీనిని గుర్తించే ప్రైవేటు రంగంలోని కంపెనీలు ఇందులో భాగం కోరుకుంటున్నాయి. ఇండియాలో ఫుడ్ వేస్టేజ్ చాలా ఎక్కువ. టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడమే వేస్టేజ్‌కు కారణమవుతోంది. కాబట్టి, ఈ ప్రోగ్రామ్‌కు చాలా స్కోప్ ఉంటుంది.
‑ అంకుర్ పాహ్వా పార్ట్నర్, ఈవై ఇండియా
ఇండియాలో టెక్నాలజీ వాడకం ఇంకా ప్రాధమిక దశలోనే ఉంది. టెక్నాలజీ అందుబాటులోకి తేవడానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ లేదు. వరదలు, కరువులు వంటివి తరచుగా వస్తుండడం వల్ల కూడా ఇక్కడ డిజిటల్ సొల్యూషన్స్ రావడానికి అడ్డుగా నిలుస్తున్నాయి.
‑ ఆపేక్షా కౌశిక్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, గార్ట్నర్