న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఫ్యాక్టరీల్లో ప్రొడక్షన్‌ను మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం కంపెనీలకు అనుమతిస్తూ కేంద్రం తాజాగా గైడ్‌లైన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తమకు అవసరమైన పర్మిషన్లు ఇవ్వాలని ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, మిక్సర్ గ్రైండర్ల వంటివి తయారు చేసే ఎలక్ట్రానిక్స్, హోం అప్లియెన్సెస్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాలను, స్థానిక పాలనాసంస్థలను కోరుతున్నాయి. ‘లాక్‌డౌన్ పొడగించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఈ నెల 20 తరువాత ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి వైట్‌గూడ్స్ కంపెనీలకు అనుమతి ఇస్తున్నట్టు గైడ్‌లైన్స్ పేర్కొన్నాయి. ఈ విషయంలో మాకు మరింత స్పష్టత కావాలి. దశలవారీగా ఫ్యాక్టరీలను తెరవాలని అంటున్నారు. అనుమతులు ఉన్న చోట ప్రొడక్షన్‌ను తిరిగి మొదలుపెట్టడానికి అన్ని బ్రాండ్లూ సిద్ధమవుతున్నాయి’’ అని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీమా) ప్రెసిడెంట్ కమల్ నంది అన్నారు. చాలా ఫ్యాక్టరీలు కరోనా రెడ్‌జోన్ల పరిధిలో ఉన్నాయని, మరికొన్ని మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయని, అనుమతుల గురించి స్పష్టత ఉంటే ఫ్యాక్టరీలను వెంటనే తెరుస్తామని అన్నారు. గత నెల 25న లాక్‌డౌన్ మొదలవగా, అప్పటి నుంచి ఫ్యాక్టరీలు మూతబడే ఉన్నాయి. ఇవన్నీ ప్రొడక్షన్ తిరిగి మొదలుపెట్టాలంటే కనీసం వారం రోజుల గడువు కావాలని కమల్ పేర్కొన్నారు. కంపెనీల దగ్గర ఇప్పటికే తగినంత స్టాక్ ఉందని, పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీలను నడపాల్సిన అవసరం లేదన్నారు. ఈ–కామర్స్ కంపెనీల దగ్గర కూడా స్టాక్‌కు
ఇబ్బంది లేదన్నారు.
పర్మిషన్లపై పరేషాన్...
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే అంటాయా లేదా ? అనే భయం కంపెనీల్లో కనిపిస్తోంది. ఉదాహరణకు పానాసోనిక్‌కు హరియాణాలోని ఝజ్జర్ వద్ద ప్లాంటు ఉంది.ఈ నెల 20 నుంచి ఫ్యాక్టరీని నడపడానికి అక్కడి లోకల్ అథారిటీలు అన్ని పర్మిషన్లు ఇస్తారని నమ్మకంగా ఉంది. తమ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం గ్రీన్‌జోన్‌లో ఉంది కాబట్టి పర్మిషన్లు సులువుగానే వస్తాయని అనుకుంటున్నట్టు పానాసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ మనీశ్ శర్మ వివరించారు. ‘‘ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వర్కర్లను బ్యాచ్‌లవారీగా అనుమతిస్తాం. సోషల్ డిస్టెన్సెంగ్ తప్పనిసరి చేస్తాం. తరచూ శానిటైజర్ వాడాలని ఆదేశిస్తాం. అందరికీ మాస్కులు అందిస్తాం’’ అని ఆయన వివరించారు. శామ్‌సంగ్ కూడా 20 నుంచి ఫ్యాక్టరీలను తెరవడానికి స్థానిక ఆఫీసర్లతో చర్చిస్తోంది. మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్‌కు మినహాయింపులు ఇవ్వడం వల్ల ఇండస్ట్రీలో సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని డైకిన్ ఇండియా ఎండీ, సీఈఓ కమల్జీత్ జవా అన్నారు. మరో ఎలక్ట్రానిక్స్ కంపెనీ హాయర్ వాదన వేరేలా ఉంది. రిటైల్ షాపులకు అనుమతి ఇవ్వకుండా ఫ్యాక్టరీలకు పర్మిషన్ ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా ప్రశ్నించారు. ఇప్పుడు ఫ్యాక్టరీలు తెరిచినా, ఫ్యాక్టరీ కెపాసిటీలో 25 శాతానికి మించి ఉపయోగించుకునే పరిస్థితులు లేవని, కార్మికులు రావడం లేదని వివరించారు. ‘‘ఎండాకాలం మొదలై నెలకుపైగా అవుతోంది. మేం చాలా గిరాకీని నష్టపోయాం. ఈ సమయంలో ఫ్రిజ్‌లు, కూలర్లు, ఏసీలకు బాగా డిమాండ్ ఉంటుంది’’ అని ఆయన వివరించారు. నోయిడా, పుణేలో ఫ్యాక్టరీలను నడుపుతున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కూడా మినహాయింపులను స్వాగతించింది. ఫ్యాక్టరీలకు పర్మిషన్ ఇవ్వడమేగాక, టీవీలు, రిఫ్రిజిరేటర్ వంటి వైట్‌గూడ్స్‌ను ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీల ద్వారా అమ్ముకునేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.