న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), జనరేటివ్ ఏఐ టెక్నాలజీ వైపు కంపెనీలు చూస్తున్నాయి. తమ రోజువారి కార్యకలాపాల్లో వీటిని వాడాలని ప్లాన్ చేస్తున్నాయి. పీడబ్ల్యూసీ ఇండియా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, దేశంలోని 90 శాతం ఫైనాన్షియల్ కంపెనీలు ఏఐతో ఇన్నోవేటివ్ ప్రొడక్ట్‌లు తీసుకురావాలని చూస్తున్నాయి. డేటా ఎనలిటిక్స్ టెక్నాలజీపై కూడా ఇవి ఫోకస్ పెడుతున్నాయి. 74 శాతం కంపెనీలు ఈ టెక్నాలజీ వైపు మొగ్గు చూపాయి. ఫైనాన్షియల్ సెక్టార్‌లో నిర్ణయాలు తీసుకోవడంలో డేటా ఎనలిటిక్స్ సాయపడుతుందని చెబుతున్నాయి.
మొత్తం 31 బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫిన్‌టెక్‌లను సర్వే చేసి ఈ రిపోర్ట్‌ను పీడబ్ల్యూసీ ఇండియా విడుదల చేసింది. ‘ఏఐ, జనరేటివ్ ఏఐపై ఫైనాన్షియల్ సంస్థలు ఫోకస్ పెట్టాయి. కస్టమర్ల ఎక్స్‌పీరియెన్స్‌ను మెరుగుపరచడానికి, ఆన్ బోర్డింగ్, ఇతర సర్వీస్‌లను అందించడంలో ఏఐ కీలకంగా మారుతుందని 84 శాతం మంది రెస్పాండెంట్లు భావిస్తున్నారు’ అని ఈ రిపోర్ట్ వివరించింది.