
న్యూఢిల్లీ: ఉద్యోగం మారేటప్పుడు పీఎఫ్ అకౌంట్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసే ప్రాసెస్ మరింత సులభంగా మారింది. బదిలీ ప్రక్రియలో ఎంప్లాయర్ (యజమాని) నుంచి ఆమోదం పొందాల్సిన అవసరాన్ని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) తొలగించింది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అకౌంట్‌ను బదిలీ చేయడంలో రెండు ఈపీఎఫ్ కార్యాలయాలు పాల్గొంటాయి. సోర్స్ ఆఫీస్ నుంచి పీఎఫ్ మొత్తం బదిలీ అవుతుంది. డెస్టినేషన్ ఆఫీస్ వద్ద పీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది.
తాజాగా ఈ ప్రాసెస్‌ను ప్రభుత్వం మరింతగా సరళీకరించింది. ఫామ్ 13 సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చి, డెస్టినేషన్ ఆఫీస్‌లో అన్ని బదిలీ క్లెయిమ్‌ల ఆమోదం అవసరాన్ని తొలగించింది. ఇక మీదట ట్రాన్స్‌ఫరర్ (సోర్స్) ఆఫీస్‌లో ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్స్ ఆమోదం పొందితే సరిపోతుంది. పాత పీఎఫ్ అకౌంట్, ట్రాన్స్‌ఫరీ (డెస్టినేషన్) ఆఫీస్‌లోని ప్రస్తుత అకౌంట్‌కు తక్షణమే బదిలీ అవుతుంది. పన్ను విధించదగిన, పన్నేతర విభాగాలుగా పీఎఫ్ అమౌంట్‌ను ఈ ఫామ్ 13 సాఫ్ట్‌వేర్ వేరు చేస్తుంది.
దీంతో పీఎఫ్ వడ్డీపై టీడీఎస్‌ను ఈజీగా లెక్కించొచ్చు. ప్రభుత్వ తాజా చర్యతో 1.25 కోట్లకు పైగా ఈపీఎఫ్‌ఓ సభ్యులకు ప్రయోజనం చేకూరుతుందని, ఏడాదికి సుమారు రూ. 90 వేల కోట్ల ట్రాన్స్‌ఫర్‌లు సులభం అవుతాయని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, మెంబర్ ఐడీ, ఇతర అందుబాటులో ఉన్న సభ్యుల సమాచారం ఆధారంగా పెద్ద మొత్తంలో యూఏఎన్‌లను క్రియేట్ చేయడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చారు. దీనిని ఎఫ్‌ఓ ఇంటర్‌ఫేస్ ద్వారా ఫీల్డ్ ఆఫీసులకు అందుబాటులో ఉంచారు.