సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులకు 40 లక్షల బీమా

సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులకు 40 లక్షల బీమా
  • నేడు బ్యాంకులతో ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల బీమా కల్పించాలని సంస్థ యోచిస్తోంది. గత ఏడాది నుంచి సంస్థ కార్మికులకు కోటి రూపాయలు, కాంట్రాక్ట్​ కార్మికులకు 30 లక్షల బీమా అమలు జరుగుతోంది. తాజాగా దాన్ని పెంచుతూ సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకుంటోంది. కార్మికులకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా, మృతిచెందినా వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

ఈ మేరకు ఆదివారం ప్రజా భవన్​లో సీఎం రేవంత్‌‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల సమక్షంలో సింగరేణి యాజమాన్యం, పలు బ్యాంకుల యాజమాన్యాల మధ్య ఒప్పందాలు చేసుకోనుంది. ఇప్పటికే యూనియన్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా, ఎస్‌‌బీఐలో శాలరీ అకౌంట్​కలిగి ఉన్న కార్మికులకు, ఉద్యోగులకు రూ.కోటి ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా హెడ్‌‌డీఎఫ్‌‌సీలో శాలరీ అకౌంట్​ ఉన్నవాళ్లకు రూ.40 లక్షల ఉచిత బీమా సౌకర్యం అందిస్తున్నారు. 

తాజాగా, ఈ బీమా సౌకర్యం పెరగనుంది.. ప్రమాదంలో చనిపోతే కార్మికులకు రూ.కోటిన్నర, కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల పరిహారం అందిస్తారు. శాశ్వత వైకల్యం సంభవిస్తే అంతే మొత్తంలో పరిహారం అందనుంది. పాక్షిక వైకల్యం సంభవిస్తే కార్మికులకు రూ.40 లక్షలు, కాంట్రాక్టు కార్మికులకు రూ.20 లక్షల చొప్పున పరిహారం అందనుంది. ఆదివారం జరిగే కార్యక్రమంలో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు గత ఏడాదిగా మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల బీమా సొమ్ము అందించనున్నారు.