టాలెంట్ కోసం భారత్ వైపు ప్రపంచం చూపు : కిషన్ రెడ్డి

టాలెంట్ కోసం భారత్ వైపు ప్రపంచం చూపు : కిషన్ రెడ్డి
  • కార్పొరేట్ గవర్నెన్స్​లో కంపెనీ సెక్రటరీల పాత్ర కీలకం: కిషన్ రెడ్డి 
  • హైదరాబాద్​లో ఐసీఎస్ఐ భవన నిర్మాణానికి శంకుస్థాపన 

హైదరాబాద్, వెలుగు:  ప్రపంచ దేశాలన్నీ టాలెంట్ ఉన్న ప్రొఫెషనల్స్ కోసం భారత్ వైపు చూస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జర్మనీ, జపాన్ లాంటి దేశాలు మన టాలెంట్ ని గుర్తించి.. కంపెనీ సెక్రటరీలు, లాయర్లు, అకౌంటెంట్లను రిక్రూట్ చేసుకుంటున్నాయని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) నూతన భవన నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ భవనం దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ కు కీలకం అవుతుందన్నారు. కార్పొరేట్ రంగంలో కంపెనీ సెక్రటరీలు చాలా ముఖ్య పాత్రను పోషిస్తున్నారని చెప్పారు. 

కార్పొరేట్ కంపెనీలు విలువలను పాటిస్తూ, పారదర్శకంగా చట్టాలను అనుసరించేలా చేస్తూ దేశ కార్పొరేట్ గవర్నెన్స్ కు కంపెనీ సెక్రటరీలు వెన్నెముకలా నిలుస్తారని కొనియాడారు. 2017లో జరిగిన ఐసీఎస్ఐ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ సైతం ఇదే విషయాన్ని చెప్పారన్నారు. దేశంలో కార్పొరేట్ సంస్కృతిని పెంపొందించడంతో పాటు వ్యాపారంపై నమ్మకం కలిగేలా చేశారని.. ఈ నమ్మకంతోనే దేశ, విదేశీ పెట్టుబడిదారులు, సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు.

అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటికే భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. భారత్ ఆత్మ నిర్భరత సాధించే దిశగా ఐసీఎస్ఐ లాంటి సంస్థలు కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ ధనుంజయ్ శుక్లా, నరసింహన్, పవన్ జీ. చందక్, మధుసూదనన్, వెంకటరమణ పాల్గొన్నారు.