పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగం పీకేయమంటారా : కంపెనీ వార్నింగ్ తో ఉద్యోగులు బెంబేలు

పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగం పీకేయమంటారా : కంపెనీ వార్నింగ్ తో ఉద్యోగులు బెంబేలు

ఉద్యోగం ఇచ్చిన కంపెనీ టార్గెట్ ఒకటే ఉంటుంది.. బాగా పని చేయాలి.. పద్దతిగా చేయాలి.. లాభాలు రావాలి.. నెంబర్ వన్ గా కంపెనీ ఉండాలి.. ఇదే కదా.. ఈ కంపెనీ మాత్రం వింతల్లోనే వింత కండీషన్ పెట్టింది. ఉద్యోగులు బాగా పని చేయటం అని తిట్టటం లేదు కొట్టటం లేదు.. ఉద్యోగం పీకేయటం లేదు.. పెళ్లి చేసుకోవటం లేదనే కారణంగా ఉద్యోగులను ఇంటికి పంపిస్తుంది. దీనికి ఓ డెడ్ లైన్ కూడా పెట్టింది. కంపెనీ కొత్త రూల్ పై ఉద్యోగుల రియాక్షన్ ఏంటీ.. వాళ్ల ఫీలింగ్స్ ఏంటీ.. అసలు ఇలాంటి కండీషన్ పెట్టిన కంపెనీ ఏంటీ.. ఎక్కడ.. ఎందుకు అనే వివరాలు తెలుసుకుందామా..

చైనా దేశం. షాన్డాంగ్ సిటీ. ఘంటియాన్ కెమికల్స్ అనే కంపెనీ. చాలా పెద్ద కంపెనీనే.. వందల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. చైనా సంప్రదాయాలు, సంస్కృతిని బాగా ప్రేమించే యాజమాన్యం అది. కంపెనీ లాభాల్లో ఉంది.. జీతాలు బాగా ఇస్తున్నారు.. ఉద్యోగులను కూడా కంపెనీ బాగా చూసుకుంటుంది. అంతా బాగానే ఉన్నా.. ప్రభుత్వం ఇచ్చిన ఓ పిలుపు.. ఆ కంపెనీపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తగ్గిపోతున్న జనాభాను పెంచటానికి పెళ్లిళ్లు చేసుకోవాలంటూ చైనా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఘంటియాన్ కెమికల్స్ కంపెనీ ఓ నిర్ణయం తీసుకున్నది. తన కంపెనీలో పని చేసే ఉద్యోగుల వివరాలు చూస్తే.. షాకింగ్ గా ఉన్నాయి. సగం మంది పెళ్లి చేసుకోలేదు.. మరికొంత మంది విడాకులు తీసుకున్నారు.. సగానికి సగం మంది ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కంపెనీలోని పెళ్లి కాని ఉద్యోగులు అందరూ పెళ్లి చేసుకోవాలి.. విడాకులు తీసుకున్న వారు రెండో పెళ్లి చేసుకోవాలని.. పిల్లలతో ఫ్యామిలీ ఉండాలని ఆర్డర్స్ వేసింది.

ఆర్డర్స్ వేయటమే కాదు.. ఓ కండీషన్ కూడా పెట్టింది. 2025 సెప్టెంబర్ నాటికి కంపెనీలో ఎవరూ పెళ్లికాని వారు ఉండకూడదనే నిర్ణయానికి వచ్చి.. డెడ్ లైన్ కూడా పెట్టింది. 28 నుంచి 58 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వాళ్లందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది కంపెనీ. సెప్టెంబర్ నెల తర్వాత పెళ్లి చేసుకోని వాళ్లను ఉద్యోగం నుంచి పీకేస్తామని వార్నింగ్ ఇచ్చింది కంపెనీ. 

ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులు బయటకు చెప్పటంతో పెద్ద రాద్దాంతం అయ్యింది. ఈ కండీషన్ ను కంపెనీ యాజమాన్యం సమర్ధించుకున్నది. చైనా దేశం కోసం ఇది మంచి నిర్ణయమే అని స్పష్టం చేసింది. కుటుంబం లేకుండా ఎలా జీవిస్తారు.. కుటుంబం లేకపోతే మనుగడ ఏంటీ అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ .. చాలా గట్టిగా సమర్థించుకున్నది ఘంటియాన్ కెమికల్స్ కంపెనీ. 

కంపెనీ ఆలోచన బాగున్నా.. పెళ్లి పేరుతో ఉద్యోగాలను తీసివేయటం అనే నిబంధనపై చైనా లీగల్ అథారిటీ తీవ్రంగా స్పందించింది. కంపెనీని తనిఖీ చేసి.. వార్నింగ్ ఇచ్చింది. పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కనటం అనేది వారి వారి జీవితాలకు సంబంధించినది అని.. ఇలాంటి కండీషన్ పెట్టటం వాళ్ల స్వేచ్ఛను హరించటమే అని స్పష్టం చేసింది. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇస్తుందని.. అంతేకానీ బలవంతపు పెళ్లిళ్లు చేయటం లేదంటూ లీగల్ అథారిటీ వార్నింగ్ ఇచ్చింది కంపెనీ. 

మొత్తానికి ప్రభుత్వ సంస్థల నుంచి, ఇతర సామాజిక వేత్తల నుంచి వచ్చిన విమర్శలతో కంపెనీ వెనక్కి తగ్గింది. పెళ్లి చేసుకోకపోయినా ఉద్యోగం పీకేయం అని స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఇక నుంచి ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మాత్రం కచ్చితంగా పెళ్లి అయ్యి ఉండాల్సిందే అంటున్నారు నెటిజన్లు. కొత్త రిక్రూట్ మెంట్ ఓన్లీ పెళ్లయిన వాళ్లకే ఉండొచ్చు అంటున్నారు నెటిజన్లు. 

ఒకప్పుడు జనం ఎక్కువ అయ్యి అల్లాడిపోయిన చైనా.. ఇప్పుడు అదే జనం కోసం అల్లాడిపోతుంది. ఎంతలో ఎంత మార్పు..