మంచిర్యాల, ఆదిలాబాద్​ జిల్లాల్లో క్రైమ్ రేట్​ పెరిగింది

  • మంచిర్యాలలో 4,793, ఆదిలాబాద్​లో 4050 కేసులు నమోదు
  • మహిళలు, చిన్నారులపై దాడులు, సైబర్​క్రైమ్స్ అధికం
  • ఆగని గంజాయి స్మగ్లింగ్
  • రోడ్డు ప్రమాదాల్లో 200 మందికి పైగా మృతి​

మంచిర్యాల, వెలుగు: గతేడాదితో పోలిస్తే ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈసారి క్రైమ్​రేట్​పెరిగింది. మొత్తంగా ఆదిలాబాద్​లో 4,050 కేసులు, మంచిర్యాలలో 4,793 కేసులు నమోదయ్యాయి. సైబర్​క్రైమ్స్, మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగాయి. మిస్సింగ్​కేసులు ఎక్కువగా రిజిస్టర్​అయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. రామగుండం కమిషనర్​రెమా రాజేశ్వరి శుక్రవారం మంచిర్యాల జిల్లా యాన్యువల్​క్రైమ్​రిపోర్టును మీడియాకు వెల్లడించారు. ఆదిలాబాద్​జిల్లా రిపోర్టును పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాకు రిలీజ్​చేశారు. 

మంచిర్యాల జిల్లాలో.. 

మంచిర్యాల జిల్లాలో 2022లో మొత్తం 3,745 కేసులు నమోదు కాగా, ఈసారి 4,793 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన గతేడాది కంటే నేరాలు పెరిగాయి. వీటిలో 793 కేసులు ఇన్వెస్టిగేషన్​లో ఉన్నాయి. పీటీ కేసులు గతేడాది 8,766 నమోదు కాగా, ఈసారి 9,447 నమోదయ్యాయి. మర్డర్లు, రేప్​కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. మహిళలపై దాడులు, మిన్సింగ్, చీటింగ్, దొంగతనాలు, కిడ్నాప్, సైబర్ క్రైమ్​కేసులు పెరిగాయి. ఈ ఏడాది మొత్తం 326 యాక్సిడెంట్లు జరిగాయి.​ 111 మంది మృత్యువాత పడ్డారు. 320 మంది గాయపడ్డారు. 22 మర్డర్లు, 41 మర్డర్​అటెంప్ట్​కేసులు నమోదయ్యాయి. 41 కిడ్నాప్, 41 రేప్, 349 చీటింగ్, 302 మిస్సింగ్​కేసులు నమోదయ్యాయి. మిస్సింగ్​కేసుల్లో ముగ్గురు బాలురు, ఒక బాలిక, 114 మంది పురుషులు, 196 మంది మహిళలు ఉన్నారు.  

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 31 మందిపై పోలీసులు హిస్టరీ షీట్స్​ఓపెన్​ చేశారు. ఇందులో15 మందిపై రౌడీషీట్స్, 16 మందిపై సస్పెక్ట్​ షీట్స్​ఓపెన్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 74 నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్​ నమోదు చేసిన వెంటనే బాధితులకు రూ.15.45 లక్షల నష్టపరిహారం అందించారు. 16 కేసుల్లో చార్జిషీట్​ వేసిన తర్వాత రూ.5లక్షల పరిహారం కోసం ప్రపోజల్స్ పంపారు.

57 మంది చిన్నారుల రెస్క్యూ

మంచిర్యాల జిల్లాలో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్​ముస్కాన్​ ప్రోగ్రామ్స్​ద్వారా 57 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు.  ఇందులో 50 మంది బాలురు, ఏడుగురు బాలికలు ఉన్నారు. 177 సైబర్​నేరాల్లో 183 మంది బాధితులకు రూ.4కోట్ల30లక్షల89వేల543 రివకరీ చేశారు. ఈచాలన్​ కేసులు 1,53,230 నమోదు కాగా, రూ.3కోట్ల37లక్షల67వేల965 ఫైన్​ వేశారు.​ 5,849  డ్రంక్​ అండ్​ డ్రైవ్ కేసుల్లో రూ.51లక్షల47వేల40 ఫైన్​వసూలు చేశారు. 

33 గ్యాంబ్లింగ్  కేసుల్లో 204 మంది నిందితుల నుంచి రూ.16లక్షల97వేల23 సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 48 గంజాయి కేసుల్లో 73 మందిని అరెస్ట్​ చేసి 483.33 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఆటోలు, టాక్సీల్లో  ప్రయాణించే మహిళల భద్రత కోసం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజు అభయ మొబైల్​యాప్​ను ప్రవేశపెట్టారు. కంట్రోల్​ రూమ్​లో 9,119 ఆటోల సమాచారాన్ని పొందుపర్చారు. కమిషనరేట్​ పరిధిలో సీనియర్​ సిటిజన్ల భద్రత కోసం స్వచ్ఛంద కమిటీలను ఏర్పాటు చేశారు. 

ఆదిలాబాద్​జిల్లాలో.. 

గతేడాదితో పోలిస్తే ఆదిలాబాద్​జిల్లాలో నేరాలు పెరిగాయి. గతేడాది 3,306 కేసులు నమోదు కాగా, ఈసారి 4,050 కేసులు నమోదయ్యాయి. కిందటేడు 286 రోడ్​యాక్సిడెంట్లు జరగగా 154 మంది చనిపోయారు. ఈసారి 282 ప్రమాదాలు జరగగా, 154 మంది మృత్యువాత పడ్డారు. గతేడాది 11 మర్డర్లు జరగగా, ఈసారి ఆ సంఖ్య 18కి చేరింది. గతేడాది లోక్ అదాలత్ లో 1,118 కేసులు పరిష్కరించగా, ఈసారి 1,284 కేసులు పరిష్కరించారు. 

మహిళలకు సంబంధించి ఈసారి 309 కేసులు నమోదయ్యాయి. మైనర్ బాలికలకు సంబంధించి గతేడాది 45 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 49 నమోదయ్యాయి. గంజాయి కేసులు విపరీతంగా పెరిగాయి. 2022లో 18 కేసుల్లో 49 మందిని అరెస్టు చేసి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈసారి 29 కేసుల్లో 67 మందిని అరెస్టు చేసి 291 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అధికమయ్యాయి.  గతేడాది 5,494 నమోదు కాగా, ఈసారి ఆ సంఖ్య 6,714కు పెరిగింది. 2022లో 188 దొంగతనాలు జరగగా, 2023లో 264 దొంగతనాలు జరిగాయి. రూ.1.94 కోట్ల నగదు, నగలు చోరీకి గురయ్యాయి.