ఎమ్మెల్యేలు టైం ఇయ్యక నష్టపరిహారం పంపిణీ పెండింగ్​

ఎమ్మెల్యేలు టైం ఇయ్యక నష్టపరిహారం పంపిణీ పెండింగ్​

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్​ జిల్లాల్లో ఎమ్మెల్యేలు టైం ఇయ్యక రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ ఆగిపోయింది. గడిచిన వానాకాలం సీజన్​లో జిల్లాలోని కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల పరిధిలో వర్షాల వల్ల మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 3 మండలాల పరిధిలో రూ.46 లక్షల మేర పరిహారం మంజూరైంది. ఈ క్రమంలో ఈనెల 12న వ్యవసాయ మంత్రి నిరంజన్​ రెడ్డి వరంగల్​ జిల్లా నర్సంపేటలో  రైతులకు నష్టపరిహరం చెక్కులు పంపిణీ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ వెంటనే పంపిణీకి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. కానీ, జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్​ ఎమ్మెల్యే బానోతు శంకర్​ నాయక్​, ములుగు ఎమ్మెల్యే సీతక్క.. చెక్కుల పంపిణీకి టైం ఇవ్వడం లేదు. దీంతో వారి కోసం అగ్రికల్చర్​ ఆఫీసర్లు ఎదురుచూస్తున్నారు. చెక్కులు రెడీగా ఉన్నా ఎమ్మెల్యేలు టైం ఇవ్వకపోవడం వల్ల  పంపిణీ చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

మహబూబాబాద్​ జిల్లాలోని కొత్తగూడ మండలం తిమ్మాపూర్, మోకాళ్లపల్లి, గుండం, మోండ్రాయిగూడెం, మైలారం, కొత్తపల్లి, రైతుగూడెం, రంగప్పగూడెం గ్రామాల్లో 148 మంది రైతులకు చెందిన మొక్కజొన్నకు 52 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఇందుకు సంబంధించి రూ.4,33,316 మంజూరయ్యాయి. గూడురు మండంలో గూడూరు, బొళ్లేపల్లి, పొనుగోడు, ముచ్చెర్ల, గుండెంగ,వెంగంపేట, ఊట్ల గ్రామాల్లో 131 మక్కజొన్న రైతులకు 53.34 ఎకరాల్లో నష్టం వాటిల్లగా రూ.4,44,517 మంజూరైంది. అలాగే గంగారం మండలం, ఇతర మండలాల్లో మిర్చి పంట నష్టానికి రూ.46 లక్షల మేర ఫండ్స్​ మం జూరయ్యాయి. ఆఫీసర్లు రైతులవారీగా చెక్కులు  రెడీ చేసి ఉంచారు. వాటిని ఆఫీసర్లు కాకుండా ఎమ్మెల్యేలే పంచాలని సర్కారు ఆదేశించడం, ఎమ్మెల్యేలు టైం ఇవ్వకపోవడంతో చెక్కుల పంపిణీ పెండింగ్​లో పండింది.

చెక్కులను వెంటనే అందించాలి 

గత వానాకాలం అకాల వర్షాల వల్ల  5 ఎకరాల్లో మక్క నేలమట్టమైంది. అప్పట్లో ఆఫీసర్లు పంటనష్టం అంచనా వేసిన్రు. ఇటీవలే  నా పేరుపై చెక్కు వచ్చిందని తెలిసింది. నేను అడిగితే మంత్రి వచ్చి పంచుతారని చెప్పారు. మొన్నటి వర్షాలకు మళ్లీ పంట నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్నాం. వెంటనే  పరిహారం అందించాలి.
- గుగులోతు బాలు, రైతు, మైలారం తండా, కొత్తగూడ మండలం

త్వరలోనే పంపిణీ చేస్తం 

2022లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరైన చెక్కులు మా వద్దే పెండింగ్​లో ఉన్నాయి. ఎమ్మెల్యేలు శంకర్​ నాయక్, సీతక్క, మంత్రి సత్యవతి రాథోడ్  చెక్కుల పంపిణీ ​కార్యక్రమానికి వస్తామన్నారు. వారి కోసం చూస్తున్నాం. వారం రోజుల్లో చెక్కుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటం. రైతులు ఆందోళన చెందవద్దు.
- ఛత్రునాయక్, జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్, మహబూబాబాద్