అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన తుమ్మల, శ్రీధర్‌‌బాబు, పొన్నం

సిద్దిపేట, వెలుగు : అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అకాల, వడగండ్ల వర్షంతో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్‌‌లో దెబ్బతిన్న పంటలను శుక్రవారం శుక్రవారం మంత్రులు శ్రీధర్‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ మూడు రోజులుగా కురిసిన వర్షం రైతన్నకు తీవ్ర నష్టం మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎంతోపాటు కేబినెట్‌‌ నిర్ణయించిందని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌‌ కలిసి పంట నష్టాన్ని పరిశీలించి వివరాలు అందజేయాలని ఆదేశించారు. వడగండ్ల వర్షంతో సిద్దిపేట జిల్లాలో ఎక్కువ నష్టం జరిగిందని తర్వాత సిరిసిల్ల జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగిందన్నారు. అనంతరం నంగునూరు మండలం వెంకటాపూర్‌‌, ముండ్రాయిలో దెబ్బతిన్న వరి, మామిడి, బీర, కూరగాయల పంటలను పరిశీలించారు. వారి వెంట కలెక్టర్‌‌ మనుచౌదరి ఉన్నారు.

నర్మెటలో ఆయిల్‌‌పామ్‌‌ ఫ్యాక్టరీ పరిశీలన

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్‌‌పామ్‌‌ ఫ్యాక్టరీని శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌‌ పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. జూన్‌‌ నెలాఖరులోగా ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా, పంట విస్తీర్ణం పెంపును వారం వారం పర్యవేక్షించాలని కలెక్టర్‌‌ను ఆదేశించారు. అనుకూలమైన వాతావరణం, నీటి వనరులు ఉన్నందున రైతులు ఆయిల్‌‌పామ్‌‌ సాగుకు మొగ్గు చూపాలని సూచించారు.