- కేఎల్ఐ డీ8 కెనాల్ డిస్ట్రిబ్యూటరీ భూములకూ పైసలు రాలే
వనపర్తి, వెలుగు: ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా 18 ఏండ్ల కింద రిజర్వాయర్లు, కెనాల్స్ నిర్మాణం కోసం భూములు అప్పగించిన నిర్వాసితులకు నేటికీ పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. 2005లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అప్పటి వైఎస్ సర్కారు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలోని భీమా, కల్వకుర్తి, సంగంబండ, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో భాగంగా రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు సేకరించారు.
అయితే అప్పటి భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ఎకరం భూమికి రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల పరిహారం చెల్లించారు. దీనికి తోడు ఇండ్లు ముంపునకు గురైన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద మరో చోట ఇంటి స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే పునరావాస కేంద్రాల్లో స్థలాలు కేటాయించకపోవడంతో నిర్వాసితులు తిప్పలు పడుతున్నారు. మరో పక్క పరిహారం పెంపు విషయంలో నిర్వాసితులు, ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.
వనపర్తి జిల్లాకొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని 1,100 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వీరికి పునరావాసం కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బాధితులు వాపోతున్నారు. దీంతో వారు ముంపు గ్రామంలోని ఇండ్లు ఖాళీ చేయడం లేదు. ప్రాజెక్టు పనులు మొదలై 18 ఏండ్లు గడిచినా పాత ఇండ్లను ఖాళీ చేయకుండా ఇబ్బంది పడుతూ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. దీంతో రిజర్వాయర్ పనులు పూర్తయినా నీటిని నిలువ చేయలేని పరిస్థితి ఉంది. నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయకపోవడంతో పంటలకు సాగు నీరందడం లేదని ఆయకట్టు రైతులు చెబుతున్నారు.
కేఎల్ఐలోనూ అదే పరిస్థితి..
వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట మండలంలోని భూములకు సాగునీటిని అందించేందుకు కల్వకుర్తి లిఫ్ట్ డీ8 నుంచి నీటిని మళ్లించేందుకు బ్రాంచ్ కెనాల్ నిర్మించారు .ఇందు కోసం 106 మంది రైతుల నుంచి 200 ఎకరాలకు పైగా భూములు సేకరించారు. వీరికి పరిహారం ఇప్పిస్తామని చెప్పి ఐదేండ్లు గడుస్తున్నా నేటికీ పరిహారం అందలేదు. కల్వకుర్తి డీ 8 కెనాల్ నుంచి 5 కిలోమీటర్ల మేర కెనాల్ తవ్వగా, 1,150 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
మరికొన్ని చెరువులు నింపేందుకు మరో రెండు కిలోమీటర్ల కెనాల్ తవ్వాల్సి ఉండగా, ముందుగా చేపట్టిన పనులకు సంబంధించి పూర్తి పరిహారం వచ్చాకే తమ భూములు ఇస్తామంటూ మిగిలిన రైతులు పనులు ఆపేశారు. మరో పక్క ఏదుల రిజర్వాయర్ లో ముంపునకు గురైన బండరావిపాకుల, కొంకల్ పల్లి గ్రామ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. పునరావాసం కల్పించకపోవడంతో వారంతా ఇప్పటికీ రేకుల షెడ్డుల్లోనే ఉంటున్నారు.
చర్చలతో సాగదీసిన పాలకులు..
భీమా ప్రాజెక్ట్ సెకండ్ ఫేస్‌లో శంకరసముద్రం, రంగసముద్రం రిజర్వాయర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకరసముద్రంలో 1.8 టీఎంసీలు, రంగసముద్రంలో ఒక టీఎంసీ నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది. వీటి ద్వారా 1.09 లక్షల ఎకరాల కు సాగునీరు అందించాల్సి ఉంది. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందక కోర్టుకు వెళ్లారు. తమ భూములకు పరిహారం తక్కువగా ఇచ్చారని, ఇండ్లు, స్థలాలకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రావడంతో శంకర సముద్రం, రంగసముద్రం, ఏదుల, కల్వకుర్తి లిఫ్ట్ నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. తమకు 2013 పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, 18 ఏండ్లు దాటిన తమ పిల్లలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అంటున్నారు.