
వరంగల్/నర్సంపేట, వెలుగు: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రతీ ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డితో కలిసి ఆయన నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించారు. దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో రూ.8 కోట్లతో నిర్మించిన 10 వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గోదాం ప్రారంభించారు. అనంతరం నర్సంపేట నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు అందించే పరిహారం రూ.37 కోట్ల 50 లక్షల చెక్కును ప్రదర్శించారు. నిరంజన్‍రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్తోనే రైతులకు రూ.10 వేల నష్టపరిహారం అందిస్తున్నట్లు చెప్పారు.
రైతుబంధు, రైతు బీమా స్కీంల గొప్పదనం ఐక్యరాజ్యసమితిలోనూ మారుమోగిందన్నారు. రైతుబంధుకు రూ.65 వేల కోట్లు, రైతు బీమాకు రూ.5 వేల కోట్లు, సాగు నీటికి ఒక లక్ష 59 వేల కోట్లు, మక్కల కొనుగోలుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కొనియాడారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నర్సంపేట నియోజకవర్గంలోనే మొదటగా ఫండ్స్ రిలీజ్ చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 32,330 మంది రైతులకు రూ.37,50,04,750 పరిహారం మంజూరైనట్లు చెప్పారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు తానాజీ వాకాడే, శ్రీవత్స, అగ్రికల్చర్ జేడీఏ ఉషాదయాల్ పాల్గొన్నారు.
ప్రతి గింజా కొంటం..
తొర్రూరు, పర్వతగిరి, వెలుగు : రైతులు ఎవ్వరూ అధైర్య పడొద్దని, పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, నిరంజన్‍రెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం అమ్మాపురం, వరంగల్ జిల్లా పర్వతగిరిలో పర్యటించారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే పామాయిల్ తోటలను సందర్శించారు.