
- అగ్నిప్రమాద మరణాలకు 4 లక్షలు
- 58 కుటుంబాలకు రిలీజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత ఐదేండ్లలో పిడుగులు పడి, అగ్ని ప్రమాదాల్లో మృతి చెందినోళ్ల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపించి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చూడాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శనివారంఆదేశాలు జారీ చేసింది. పిడుగుపాటుతో చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున, అగ్ని ప్రమాదాల్లో చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత ఐదేండ్లలో పిడుగులు పడి 40 మంది చనిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరుగురు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆరుగురు, కొమ్రంభీమ్ జిల్లాలో నలుగురు, హనుమకొండ జిల్లాలో ముగ్గురు, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, రాజన్న సిరిసిల్ల, జనగామ, యాదాద్రి, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, కామారెడ్డి, నిర్మల్, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
బాధిత కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. ఇక అగ్నిప్రమాదాల్లో 18 మంది చనిపోయారు. హైదరాబాద్‌లోని రెడ్ హిల్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. హైదరాబాద్‌లోని రుబీ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేసింది.