అవసరమైతే సాయం డబ్బులు వాపస్ ఇస్తాం
మంత్రి తలసానికి మోండా మార్కెట్ నాలాబజార్ వాసుల వినతి
పద్మారావునగర్, వెలుగు: తమకు ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేల సాయం ముఖ్యం కాదని, నాలాను రిపేర్ చేయించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్ డివిజన్ నాలాబజార్ వరద బాధితులు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను రిటర్న్ ఇస్తామని చెప్పారు. బాధితులకు రూ. 10 వేలు అందించేందుకు బుధవారం మంత్రి తలసాని వెళ్లారు. ఇటీవల వరదలకు తమ ఇండ్లల్లోకి మురికి నీరు వచ్చి టీవీలు, ఫ్రిజ్‌లు, ఇంట్లోని సామాన్లు అన్ని కరాబయ్యాయని, నాలా పైపులు పూడికతో మూసుకుపోవడం వల్లే ఇట్ల జరిగిందని మంత్రికి నాలాబజార్ వాసులు చెప్పారు. త్వరలోనే రిపేర్లు చేయిస్తానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు.
ఇంటి ఓనర్లకు, కిరాయోళ్లకు మధ్య పంచాయితీ
వరదలకు నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ. 10 వేల సాయం కొన్నిచోట్ల ఇంటి ఓనర్లు, అద్దెకున్న వారి మధ్య పంచాయితీ పెడుతున్నది. వరదకు తమ సామాన్లు చెడిపోయాయని, సాయం డబ్బులు తమకే ఇవ్వాలని అద్దెకుండేవాళ్లు అంటుంటే.. ఇంట్లో రిపేర్ వస్తే తామే చేయిస్తం కాబట్టి తమకే ఇవ్వాలని ఓనర్లు పట్టుబడుతున్నారు. దీంతో తగాదాలు నడుస్తున్నాయి.
రోగాల పాలవుతున్నం
నాలా పొంగి మా ఇండ్లల్లోకి నడుం లోతు మురికినీరు వచ్చింది. మస్తు ఇబ్బందులు పడ్డం. మురికి నీటితో రోగాలు వస్తున్నయ్. ప్రభుత్వం ఇచ్చిన సాయం డబ్బులు రెండు రోజుల్లో ఖతమైతయ్. నాలా పైపుల్లో పూడికను తీసి, కొత్త పైపులు వేయాలి.–కవిత, నాలా బజార్
10 వేలు రిటన్ ఇవ్వమన్నా.. ఇస్తం
మాకు సర్కార్ ఇస్తున్న రూ. 10 వేలతో సమస్య తీరదు. మాకు శాశ్వత పరిష్కారం కావాలి. అవసరమైతే సాయం డబ్బులు తిరిగి ఇస్తం. కానీ నాలా రిపేర్ చేయాలి. మాకు వరద బాధలు తప్పించాలి.– జె.చంధ్రశేఖర్, నాలా బజార్.