అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఆర్భాటాలా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ( మే1)న సారంగాపూర్ మండలంలోని అర్పల్లి గ్రామంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యం, కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సమయంలో బీఆర్ఎస్ నాయకులు పార్టీ సమావేశాల ఆర్భాటాలు చేయడం ఎంత వరకు సమంజసం అని దానికి తోడు అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.అకాల వర్షాలకు ధాన్యం తడిసి, రంగు మారాయని, ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అశికారుల మధ్య సమస్వయ లోపంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్భాటాలు సరికాదు
వెంటనే ధాన్యం తూకం వేయడం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సమయంలో బీఆర్ఎస్ నాయకులు పార్టీ సమావేశాల ఆర్భాటాలు చేయడం ఎంత వరకు సమంజసం అని దానికి తోడు అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే యాసంగి పంట మొదలైనప్పటి నుంచి చీడ, పీడ పురుగులతో దిగుబడి తగ్గిందని సమయానుకూలంగా ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తూకం విషయంలో జిల్లా అధికారులతో మాట్లాడితే తూకం వేస్తామని చెప్పడమే తప్పా..పనులు ప్రారంభించిన దాఖలు లేవన్నారు.
ఇంకా పంటనష్టం ఎందుకు వేయలేదు
ప్రకృతి వైపరీత్యాలతో సగం పంట పొలాల్లోనే పోయిందని చేతికిందిన పంట సైతం అధికారుల మధ్య సమన్వయ లోపంతో సకాలంలో తూకం వేయలేదన్నారు. అకాల వర్షాలకు దాన్యం తడిసి రైతులు మరింత ఇబ్బందులకు గురవుతున్నరన్నారు. పంట నష్టం అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అధికారులు ఎందుకు పర్యటన చేయలేదని ప్రశ్నించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేయడమే కానీ ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు రావడం లేదన్నారు.
రైతులపై భారం
గతంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు 6 రూపాయలు.. ఎఫ్సీఐ ఐదు రూపాయలు ఇచ్చేదని అన్నారు. నేడు క్వింటాకు 30 నుంచి 35 రూపాయలవరకు రైతులపై భారం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆరు రూపాయలు ఇవ్వకపోవడంతో పాటు కేంద్రం ఎఫ్ సి ఐ ద్వారా రైతుకు చెల్లిస్తున్న ఐదు రూపాయల సైతం రైతులకు చెల్లించడం లేదన్నారు. రైతులు ప్రతి క్వింటాకు 11 రూపాయిలు కోల్పోతున్నారని, ఈ కమిషన్ ఎక్కడ పోతుందో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
గత రాయితీలను కొనసాగించాలి
ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు కల్పించిన రాయితీలు అన్నింటినీ ఎత్తివేసి రైతుబంధు ఇస్తున్నామనడం ఎంత వరకు సమంజసమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన రాయితీలను కొనసాగిస్తూనే రైతుబంధు కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎనమిదేళ్లుగా రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులకు నష్టపోయిన పంటకు నష్ట పరిహారం అందడం లేదన్నారు. ఇప్పటికైనా బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.