- సూర్యాపేట జిల్లాలో 70 మంది బాధితులు, రూ. కోటి పెండింగ్
- నిధులు లేవంటున్న ఆఫీసర్లు
సూర్యాపేట, వెలుగు : ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైన మూడు నెలల్లోపే బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఏడు నెలలు గడుస్తున్నా ఒక్క పైసా కూడా అందడం లేదు. కేసు విచారణ పూర్తి చేసిన ఆఫీసర్లు పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రొసీడింగ్స్ పంపినా పైసలు మాత్రం రిలీజ్ కావడం లేదు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 70 కేసులకు సంబంధించి సుమారు రూ. కోటి పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.
మూడు నెలల్లోనే ఇవ్వాల్సి ఉన్నా...
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదైన వారం రోజుల్లోపు బాధితులు మైనర్ అయితే 25 శాతం, మేజర్ అయితే 50 శాతం డబ్బులు అందజేయాలి. మిగతా మొత్తాన్ని చార్జ్‌షీట్ ఫైల్ అయ్యాక ఇవ్వాలి. రేప్, మర్డర్ కింద కేసు నమోదు అయితే బాధిత ఫ్యామిలీకి మూడు నెలలకు సరిపడా రేషన్ అందించాలి. అర్హతను బట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు, గ్రామీణ ప్రాంతాలవారైతే మూడెకరాల భూమి ఇవ్వాలి. దీంతో పాటు ఇంట్లో ఒకరికి పెన్షన్ సైతం అందజేయాలి. జీవో ప్రకారం ఇవన్నీ మూడు నెలల్లోపే అందించాలి. కానీ సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు ఒక్క బాధితుడికి కూడా రూల్స్ ప్రకారం పరిహారం ఇవ్వలేదు.
ఫండ్స్ కేటాయించని ప్రభుత్వం
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. సాయం అందించడంలో ఆలస్యం చేయొద్దని ఆర్థిక శాఖ ఆఫీసర్లు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రొసీడింగ్స్ పూర్తి కాగానే పరిహారం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఏడు నెలలు గడుస్తున్నా పరిహారం అందకపోవడంతో 70 మంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఫండ్స్ కోసం గతంలోనే ప్రపోజల్స్ పంపినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆఫీసర్లు మరోసారి హెడ్‌ఆఫీస్‌కు లెటర్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
- చివ్వెంల మండలం దురాజ్‌పల్లికి చెందిన ఆరుగురు వ్యక్తులను కులం పేరుతో దూషించిన కారణంగా గతేడాది సెప్టెంబర్ నెలలో కేసు నమోదైంది. ఎంక్వైరీ చేసిన పోలీసులు ఒక్కో భాదితుడికి రూ.25 వేల చొప్పున చెల్లించాలని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి ప్రొసీడింగ్స్ పంపించారు. కానీ ఇప్పటి వరకు బాధితులకు పరిహారం అందలేదు.
- నూతనకల్ మండలం దిర్శనపల్లికి చెందిన ఓ వ్యక్తి గతేడాది నవంబర్‌లో హత్యకు గురయ్యాడు. ఎంక్వైరీ చేసిన పోలీసులు భాదిత ఫ్యామిలీకి రూ.4 లక్షల పరిహారం చెల్లించేందుకు మేలో ప్రొసీడింగ్స్ ఇవ్వగా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రాలేదు.
- సూర్యాపేట మండలానికి చెందిన ఓ బాలికను రేప్ చేసిన ఘటనలో గతేడాది పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. బాలికకు రూ. 3.75 లక్షలు ఇచ్చేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అమౌంట్ రిలీజ్ కాలేదు.