ఇంత నిర్లక్ష్యమా.. చూపు మందగించిందని ఆస్పత్రికి పోతే.. కన్నే తీసేశారు

ఇంత నిర్లక్ష్యమా.. చూపు మందగించిందని ఆస్పత్రికి పోతే.. కన్నే తీసేశారు
  • కన్ను రేటు రూ.4 లక్షలు
  • ఆపరేషన్ ఫెయిల్ కావడంతో బాధితుడికి నష్ట పరిహారం
  • షాద్ నగర్ తులసి ఐ కేర్ ఆస్పత్రిలో ఘటన 

షాద్ నగర్, వెలుగు: చూపు మందగించిందని ఆస్పత్రికి పోతే వృద్ధుడి ఉన్న కన్నుపోయింది.  మహబూబ్​నగర్​జిల్లా బాలానగర్ మండలం చిన్నరేవల్లికి చెందిన రాములు తన కంటి చూపు మందగించడంతో ఊర్లోని ఆర్ఎంపీని కలిశాడు. ఆయన సలహాతో షాద్​నగర్​లోని తులసి కంటి హాస్పిటల్​లో చూయించుకోగా, కంటిలో పొర వచ్చిందని జులైలో ఆపరేషన్ చేశారు.

ఆపరేషన్​తర్వాత వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు.. హైదరాబాద్​లో మరో పెద్ద డాక్టర్​ఉంటాడని హుటాహుటిన మరో ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు. అక్కడ మళ్లీ ఆపరేషన్ చేయించి ఇంటికి పంపారు. ఎన్ని రోజులు గడిచినా నొప్పి తగ్గకపోవడం, చూపు మొత్తం మందగించడంతో బాధితుడు సరోజినీ కంటి హాస్పిటల్ తో పాటు ఎల్వీప్రసాద్ హాస్పిటల్లో ఇటీవల పరీక్షలు చేయించుకున్నాడు.

కంట్లో గ్లాకోమా, రెటీనా రెండు కత్తిరించారని డాక్టర్లు చెప్పడంతో బాధితుడితోపాటు అతని బంధువులు తులసి హాస్పిటల్​ముందు బుధవారం ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే  కన్ను పోయిందని ఆరోపించారు. దీంతో తొలుత తమ తప్పిదం లేదని  బుకాయించిన యాజమాన్యం.. ఆ తర్వాత బాధిత కుటుంబ సభ్యులతో భేరానికి దిగారు.

వైద్యం వికటించడంతో రూ.4 లక్షలను నష్ట పరిహారంగా ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన తులసి ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.