- రైతన్నకు దెబ్బ మీద దెబ్బ
- నెల వ్యవధిలో రెండోసారి పంటనష్టం
- సీఎం చెప్పినా గత నెల పరిహారమే అందలే..
- మళ్లీ వడగండ్లతో నష్టపోయిన రైతులు
ఖమ్మం/ ముదిగొండ, వెలుగు: అన్నదాతను వడగండ్ల వానలు ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందే సమయంలో దెబ్బతీస్తున్నాయి. పోయిన నెలలో మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. కాగా మళ్లీ రెండోసారి ఈ వారంలో వానలకు కూడా పంట నష్టం జరిగింది. మార్చి 18 నుంచి 20 వరకు వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను సీఎం కేసీఆర్స్వయంగా పరామర్శించి, వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మొదట 31 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేయగా, ఆ తర్వాత అధికారుల ఫీల్డ్ సర్వేలో ఆ సంఖ్య 23,632 ఎకరాలకు తగ్గింది. సీఎం నేరుగా ప్రకటించిన పరిహారమే ఇంకా రైతులకు అందలేదు. మళ్లీ కళ్ల ముందే పంట వానదెబ్బకు కొట్టుకుపోవడంతో రైతులకు ఏడుపొక్కటే తక్కువైంది. ప్రస్తుత తతవానలకు తడిచిన పంటను దక్కించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు.
పంటలను పరిశీలించిన కలెక్టర్, పొంగులేటి..
జిల్లాలో ఈనెల 21, 23 తేదీల్లో వడగండ్ల వాన కురిసింది. ఈసారి ముదిగొండ, ఖమ్మం, ఖమ్మం రూరల్, కొణిజర్ల మండలాల్లో మక్క, వరి పంటలు, మామిడి తోటలకు నష్టం ఎక్కువగా జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు తాజాగా చేసిన ప్రాథమిక సర్వే ప్రకారం ఈ రెండు రోజుల్లో 1751 ఎకరాల్లో మక్క, 8,169 ఎకరాల్లో వరి, 28 ఎకరాల్లో పెసర సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లింది.
బుధవారం ముదిగొండ మండలం మేడేపల్లి, ముదిగొండలో కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యటించి, పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. మరోవైపు ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన అకాల, వడగండ్ల వర్షాలకు నష్టపోయిన వరి, మామిడి, మక్క పంటలను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. వెంటనే సర్వే చేయించాలని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
పై ఫొటోలో ఉన్నది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన కౌలు రైతు పచ్చిపాల లింగయ్య కుటుంబం. వారికున్న ఎకరన్నర భూమితోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని మక్క పంట వేశారు. కౌలు ముందుగానే చెల్లించడంతోపాటు పెట్టుబడులు కలుపుకొని రూ.లక్షన్నర వరకు ఖర్చు పెట్టారు. కుటుంబ సభ్యులంతా పొలం పనులు చేశారు. గత నెలలో కురిసిన వడగండ్ల వానకు లింగయ్యకు చెందిన మక్క చేను 40 శాతం వరకు నేలవాలింది. మిగిలిన పంటను కోసి, ఖమ్మం– కోదాడ హైవేపై మక్కలను ఎండబోశారు. కాగా గత వారం కురిసిన వర్షాలకు మక్కలు తడిశాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది లింగయ్య ఫ్యామిలీ. మిగిలిన మక్కలను అమ్ముకుందామన్నా రేటు లేక కనీస పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.
పంట నష్టం వివరాలను నమోదు చేయండి
అకాల వర్షం, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటల సర్వే చేసి జరిగిన నష్టాన్ని నమోదు చేయాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంతోపాటు మేడేపల్లిలో అకాల వర్షం, వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి, మక్క పంటలను ఆయన పరిశీలించారు. పంట దెబ్బతిన్న విధానం, ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టపోయింది తదితర వివరాలను రైతుల నుంచి తెలుసుకున్నారు. పంట నష్టం వివరాలకు పాస్‌బుక్ అవసరం లేదని, సర్వే నెంబరు, సాగు రైతు బ్యాంకు పాస్‌బుక్ చాలన్నారు. పూర్తిస్థాయిలో తమను ఆదుకోవాలని రైతులు కలెక్టర్ ను వేడుకున్నారు. రైతులు, కౌలు రైతుల పంట సాగులో ఉన్న ప్రతి రైతుకు నేరుగా నష్టపరిహారం అందజేస్తామని కలెక్టర్ చెప్పారు. సర్వే చేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా నివేదికను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట జేడీఏ విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, ఏడీఏ వెంకటేశ్వర్లు, ముదిగొండ తహసీల్దార్ శిరీష, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏవో రాధ, ఏఈవో మౌనిక ఉన్నారు.
రెక్కల కష్టం నేలపాలైంది...
ఊహ వచ్చినప్పటి నుంచి ఎవుసమే చేస్తున్న. గట్లనే కుటుంబాన్ని నడుపుతున్న. యాసంగిలో నా ఎకరన్నరంతోపాటు మూడెకరాలు కౌలుకు తీసుకున్న. అంతా మక్కనే వేసిన. రూ.లక్షన్నర వరకు ఖర్చు అయింది. ఇంట్లవాళ్లంత పొలం పనులే చేసినం. అంత కష్టపడితే చెడగొట్టు వానతో మా కష్టం మొత్తం నేలపాలైంది. పెట్టుబడి మందమన్న వస్తదన్న ఆశతో మక్కలను ఎండబోసినం. మళ్లీ వాన దెబ్బకొట్టే. కష్టం దారపోసినా ప్రతిఫలం లేకపాయే.
– పచ్చిపాల లింగయ్య, రైతు, గోకినేపల్లి
ఏళ్లు గడిచినా హామీలు నెరవేర్చరు.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏళ్లు గడిచినా నెరవేరవని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని మేడేపల్లి గ్రామంలో వరి, మామిడి, మక్క పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. అకాల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బోనకల్ మండలంలో సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు గంటల వ్యవధిలో రైతులకు ఇస్తానన్న నష్టపరిహారం 45 రోజులు గడిచినా అందలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో రైతుల ఉసురు తప్పకుండా సీఎంకు, ఆయన ప్రభుత్వానికి తగులుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట కోటా రాంబాబు, దేవరపల్లి అనంతరెడ్డి, బత్తుల వెంకట్రావు, చావగాని వెంకన్న ప్రసాద్, జూలకంటి సంజీవరెడ్డి, వట్టికూటి సైదులు గౌడ్, ప్రేమ్ కుమార్, కందుల రంగారావు, వాకా వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు.