15 ఏండ్లయినా పరిహారం రాలే.. గ్రీవెన్స్​లో కలెక్టర్​కు విన్నవించిన కర్ణమామిడి గ్రామస్తులు

మంచిర్యాల, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులమైన తమకు 15 ఏండ్లయినా పరిహారం పైసలు, ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు రూ.70వేలు రాలేదని హాజీపూర్​ మండలం కర్ణమామిడి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల పైసలు త్వరగా ఇప్పించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో కలెక్టర్​ బదావత్​ సంతోష్​కు విన్నవించారు.  హాజీపూర్ మండలం పడనపల్లి గ్రామ శివారులో ఉన్న కడెం కెనాల్​ను కొంతమంది కబ్జా చేసి పంటలు వేసుకోవడంతో తమ పొలాలకు సాగునీళ్లు రావడం లేదని, విచారణ జరిపించి  న్యాయం చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన కే.స్వామి దరఖాస్తు అందజేశాడు. 

రాపల్లి గ్రామానికి చెందిన ఏనుగు భూపతిరెడ్డి ఎల్లంపల్లి ముంపు బాధితులకు జీవో నంబర్​ 1, 2017 ప్రకారం తన కుమారుడికి మేజర్ సన్ డబ్బులు ఇప్పించాలని కోరాడు. మందమర్రి మండలం పులిమడుగుకు చెందిన ఆర్.సుశీల తమ తాతకు తిమ్మాపూర్ శివారులో ఉన్న భూమిని తన చిన్నాన తప్పుడు ఆధారాలతో పట్టా చేసుకున్నారని, ఆ పట్టాను రద్దు చేస్తూ చట్టప్రకారం భూమిని పంచాలని వేడుకుంది. బెల్లంపల్లి మండలం రంగపేట శివారులో ఉన్న తన భూమిని గతంలో రైతుబంధు వచ్చి నిలిచిపోయిందని, తిరిగి ఇప్పించాలని కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్​కు చెందిన గొట్టెముక్కుల వీరవెంకటరామారావు కోరాడు.

భీమిని మండలం అక్కలపల్లి శివారులో తమ తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకొని బెదిరిస్తున్నారని, న్యాయం జరిపించాలని కామెర రాంచందర్ విన్నవించుకున్నాడు. నెన్నెల మండలం మన్నెగూడకు చెందిన గొల్లపల్లి శంకర్​కు సేత్వార్ ప్రకారం భూమి పట్టా ఉన్నప్పటికీ ధరణిలో బ్లాక్ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నామని, అన్​ బ్లాక్​ చేయాలని కోరాడు. కన్నెపల్లి మండలం దాంపూర్ శివారులోని తన భూమి ధరణిలో తన పేరు తప్పుగా నమోదు అయిందని, సవరించాలని కోరుతూ భీమిని మండలం అక్కలపల్లికి చెందిన ఇప్ప గంగయ్య పిటీషన్​ అందజేశాడు.