- డైరెక్టర్ల పదవుల కోసం ఆలేరు, నకిరేకల్ ఎమ్మెల్యేల మధ్య పోటీ
- పరిస్థితులు సానుకూలంగా లేవని ఎలక్షన్లను వాయిదా వేసిన బోర్డు
- కోఆపరేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తామంటున్న కాంగ్రెస్ లీడర్లు
- ఎమ్మెల్యేల వర్గం ఓడిపోతే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న కారణంతోనే వాయిదా!
నల్గొండ, వెలుగు : నల్గొండ–-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘంలో జ రగాల్సిన డైరెక్టర్ల ఎన్నికల వివాదం రచ్చకెక్కింది. డైరెక్టర్ల పదవుల కోసం ఎమ్మెల్యేలు పోటీ పడటంతో మదర్ డెయిరీ బోర్డు ఎన్నికల ప్రక్రియను ఆకస్మికంగా వాయిదా వేసింది. కో ఆపరేటివ్ చట్టానికి వ్యతిరేకంగా బోర్డు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, ఆశావహులు ఆందోళనకు దిగా రు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 21 వరకు నామినేషన్లను స్వీకరించాలి. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి ఫైనల్ లిస్టుఈనెల 27 తేదీన ప్రకటించాల్సి ఉంది. అదే రోజున జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, ఎన్నికలు నిర్వహించాల్సింది. కానీ, సహేతుకమైన కారణాలు చూపకుండా బోర్డులోని 15 మంది డైరెక్టర్లు ఏకపక్షంగా తీర్మానం చేసి ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా ఆపేశారు. ఈనెల 30వ తేదీన మూడు డైరెక్టర్ల స్థానాలు ఖాళీ కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఒకటి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వ హించాలి. రంగారెడ్డి జిల్లా పోస్టు రిజర్వు కేటగిరిలో ఉన్నందున మిగిలిన రెండు పోస్టుల కోసం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత భర్త డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. అత్యధిక సొసైటీలు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నందున రెండు డైరెక్టర్ల స్థానాలు తనకే కావాలని ఎమ్మెల్యే వర్గం పట్టుబడుతోంది.
అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున రెండు పోస్టులను ఆలేరు అభ్యర్థులకే ఇస్తే రాజకీయ ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే సునీత ఆశించారు. కానీ, అందుకు పోటీగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గం కూడా డైరెక్టర్ పదవిని ఆశిస్తోంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డిని డైరెక్టర్‌గా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి ఎప్పటి నుంచో పట్టుబడుతున్నారు. దీనివల్ల రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో చిట్యాల మండలం తనకు కలిస్తొందని భావించారు. ఎమ్మెల్యేల మధ్య పోటీ ఒక ఎత్తైతే ఈసారి డైరెక్టర్ పదవి కోసం అన్ని వైపుల గట్టిగానే ఫైట్ జరుగుతోంది. ఆలేరులో కాంగ్రెస్ నేత బీర్ల అయిలయ్య తన క్యాండిడేట్‌ను డైరెక్టర్ పదవికి నిలబెట్టాలని చూశారు. స్థానిక ఎమ్మెల్యే మీదున్న వ్యతిరేకత తనకు కలిస్తొందని, తద్వారా ఎన్నికలు జరిగితే తన అభ్యర్థి డైరెక్టర్‌గా ఎన్నికయ్యే చాన్స్ లభిస్తుందని ఆయన అనుకున్నారు.
ఈ క్రమంలో ఈనెల 27న డెయిరీలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో పెద్ద గొడవే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎన్నికలు పెట్టాలని మీటింగ్ బయట సొసైటీ అధ్యక్షులు ఆందోళన చేయగా, మీటింగ్ లోపల 15 మంది డైరెక్టర్లు పరిస్థితులు ఎన్నికలకు అనుకూలంగా లేవని, వాయిదా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీంతో ఆలేరు డైరెక్టర్ స్థానం కోసం పట్టుబట్టిన ఎమ్మెల్యే సునీత వర్గానికి చెంది న సొసైటీ అధ్యక్షుడు శ్రీశైలం అక్కడే తిరుగుబాటు చేశారు. ఎన్నికలు నిర్వహించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన బెదిరించారు. బలమైన కారణాలు చూపకుండా ఎన్నికలు నిలిపివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అయినా బోర్డు తీర్మానం మేరకు అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు.
సొసైటీ రూల్స్‌కు వ్యతిరేకం: అధికారులు
కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. రొటేషన్ సిస్టమ్‌లో డైరెక్టర్ల ఎన్నికలు జరపాలి. అలాగే ఆడిట్ రిపోర్ట్ ఆమోదం పొందాలి. ఇవేవీ జరగకపోతే మొత్తం పాలక మండలి రద్ధవుతుంది. అంతేగాక మూడేళ్ల పాటు పాలక మండలిలోని 15 మంది డైరెక్టర్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. ఒకవేళ ఎన్నికలు ఆపాల్సి వస్తే బలమైన కారణాలు చూపించాలి. గొడవలు సృష్టించడం, మర్డర్లు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తప్ప ఎన్నికలు వాయిదా వే యడానికి వీల్లేదు. అది కూడా కోఆపరేటివ్ కమిషనర్ అనుమతి తీసుకున్నాకే ఎన్నికలు వాయిదా వేయాలి. కానీ, ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసి, నామినేషన్లు తీసుకునే క్రమంలో ఉన్నపళంగా వాయిదా వేయడం సొసైటీ రూల్స్‌కు పూర్తి విరుద్ధమని ఎన్నికల అధికారులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో చట్టప్రకారం డెయిరీ పాలకవర్గం మొత్తం రద్దయినట్లుగానే భావించాలని అధికారులు చెబుతున్నారు. సొసైటీ కమిషనర్ జోక్యం చేసుకుని డెయిరీ అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని అంటున్నారు. లేదంటే పాల సొసైటీ అధ్యక్షులు సొసైటీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం ఉంది.
ఏది జరిగినా ఈ రెండు రోజుల వ్యవధిలోనే చేయాల్సి ఉంటుంది. ఈనెల 30 తర్వాత ముగ్గురు డైరెక్టర్ల టర్మ్ పూర్తయితే అప్పుడు బోర్డులో మిగిలేది 12 మందే. మళ్లీ వచ్చే ఏడాది చైర్మన్ ఎన్నికతో పాటు, అప్పుడు ఖాళీ అయ్యే ఆరు డైరెక్టర్ పోస్టులతో కలిపి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. రాజకీయ ప్రయోజనాలు ఆశించి డెయిరీ నడుస్తోందని, రైతుల ప్రయోజనాలు మచ్చుకైనా కనిపించడం లేదని, ఇప్పటికే రూ.30 కోట్ల అప్పులు పాలైందని సీనియర్ అధికారి ఒకరు ‘వెలుగు’ కు వెల్లడించారు. నష్టాల ను బయటికి చూపకుండా ఆడిటర్లను మేనేజ్ చేస్తున్నారని, డెయిరీ పేరు మీదున్న రూ.వేల కోట్ల ఆస్తులను ఆడిట్లలో చూపించి, లాభాల్లో నడుస్తున్నట్టు లెక్కలు తారుమారు చేస్తున్నారని ఆయన చెప్పారు. డెయిరీ దివాలా తీసే పరిస్థితులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
2020-21లో కరోనా వల్ల ఎన్నికలు వాయిదా
డెయిరీలో ఎన్నికలు వాయిదా వేసిన సంఘటన తొలిసారిగా 2020–-21 లో జరిగింది. కరోనా ఫస్ట్ వేవ్ రూల్స్‌కు కట్టుబడి కమిషనర్ అనుమతి తీసుకుని ఎన్నికలు వాయిదా వేశారు. అప్పుడు గవర్నర్ ఆమోదంతో జీఓ ఇచ్చాకే బోర్డు ఎన్నికలను వాయిదా వేసింది. తిరిగి 2022లో రెండు టర్మ్‌లకు కలిపి డైరెక్టర్లు, చైర్మన్ పదవికి ఎన్నికలు జరిగాయి. కానీ, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున డెయిరీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల వర్గం ఓడిపోయినా, లేకపోతే పదవుల పంపకాల్లో తేడా వచ్చినా దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందన్న ఏకైక కారణంతో ఎన్నికలను వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. పైగా బోర్డు చైర్మన్ శ్రీకర్ రెడ్డి.. గొంగడి మహేందర్ రెడ్డి వర్గం కావడంతో పాలకవర్గం ఏకపక్షంగా తీర్మానం చేసింది.