- మొదటి ప్రాధాన్యత ఓటు ఆధారంగా ఓట్ల లెక్కింపు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యేసాగిన పోటీ
మహబూబ్‌నగర్, వెలుగు: మహబూబ్‌నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బరిలో ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నా.. పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నడిచినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో ఓటుకు పెద్ద మొత్తంలో ఆఫర్ చేయడంతో క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో రెండు పార్టీల క్యాండిడేట్లలో ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 2న జరిగే కౌంటింగ్‌తో సస్పెన్షన్‌కు తెరపడనుంది.
మ్యాజిక్ ఫిగర్ 720
బ్యాలెట్ పద్దతిలో జరిగిన మహబూబ్‌నగర్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఓటర్లు మొదటి, రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లను వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండు, మూడో ప్రాధాన్యత ఓటు వేసినా అది చెల్లదు. ఈ నియోజకవర్గంలో 1,439 మంది ఓటర్లుండగా, మ్యాజిక్ ఫిగర్ 720 ఓట్లు. మొదటి ప్రాధాన్యత ఓటుగా 720 ఓట్లు ఎవరికి పోల్ అయితే వారినే విజయం వరిస్తుంది.
అయితే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా బీఆర్ఎస్కు 904 మంది ప్రజాప్రతినిధుల బలం ఉండగా, కాంగ్రెస్‌కు 369 మంది, బీజేపీకి 120, ఇతరులు 46 మంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్‌గా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. వీరిలో ఎవరికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 720 దక్కకపోయినా మూడో స్థానంలో ఉన్న క్యాండిడేట్‌కు పోలైన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించి విన్నర్‌ను ప్రకటిస్తారు.
రెండు వారాలుగా బేరసారాలు..
బైపోల్ సందర్భంగా ఈ నెల 12న నామినేషన్ల పర్వం ముగియగా, 14న నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. బరిలో ముగ్గురున్నా జీవన్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి మధ్య నువ్వా.. నేనా అన్నట్లు సాగింది. ఈ క్రమంలో 15వ తేదీ నుంచే ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రక్రియ మొదలైంది. రెండు పార్టీల లీడర్లు ఓటర్లు చేజార్చుకోరాదనే ఉద్దేశంతో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. దాదాపు పది రోజుల కింద ప్రధాన పార్టీల క్యాండిడేట్లు ఓటర్లను గోవా, ఊటి, కొడైకెనాల్, నెల్లూరు, కర్నాటక ప్రాంతాలకు తరలించారు. అక్కడే వీరికి అన్ని రకాల మర్యాదలు చేశారు.
క్యాంపుల్లో ఉన్న వీరిని బుధవారం రాత్రి వరకు ఇండ్లకు తరలించాల్సి ఉన్నా, క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయంతో గురువారం ఉదయం క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ సెంటర్లకు ప్రత్యేక బస్సుల్లో తీసుకొచ్చారు. ఏ మండలానికి సంబంధించి ఆ మండల పార్టీ లీడర్లను ఇన్చార్జులుగా నియమించారు. పోలింగ్ సెంటర్లలోకి అందరినీ ఒకేసారి కాకుండా మండలాల వారీగా బ్యాచులుగా తీసుకొచ్చి ఓట్లు వేయించారు.
నెక్స్ట్పోటీకి అవకాశం ఉంటుందని..
ఈ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ జరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇందుకు కారణంగా వచ్చే నెల ఎంపీటీసీల పదవీకాలం ముగియడమేనని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు గత ప్రభుత్వ హయాంలో వీరికి విలువలు లేకపోవడం, చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వీరంతా నిరుత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో బై పోల్స్ రావడం, టికెట్‌కు ఆఫర్లు రావడంతో.. వీరు కమిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.