
- శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌లను అందించేందుకు ఇండియాలోకి ఎంట్రీ ఇద్దామని చూస్తున్న స్టార్‌లింక్
- స్పెక్ట్రమ్ వేలం కంటే లైసెన్స్ విధానం కోసం లాబీయింగ్
- దీన్ని వ్యతిరేకిస్తున్న జియో
- వన్‌వెబ్, కైపర్‌లు కూడా ఇండియాలో ఎంట్రీకి రెడీ
బిజినెస్ డెస్క్, వెలుగు: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్‌కు, ఇండియాలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీకి మధ్య పోటీ మొదలయ్యింది. మస్క్ తన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ స్టార్‌లింక్‌ను ఇండియాకు తీసుకురావాలని ఆత్రుత గా ఉన్నారు. ఆయన ఎంట్రీ ఆపడానికి ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. యూఎస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని మస్క్ కలిసిన విషయం తెలిసిందే. ఇండియాలో స్టార్‌లింక్‌ను లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నామని, మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిపిస్తామని మీటింగ్ తర్వాత మస్క్ ప్రకటించారు. ప్రభుత్వం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు జియో, స్టార్‌లింక్ మధ్య పోటీ నెలకొంటుందనడంలో సందేహం లేదు. గ్లోబల్‌గా చేస్తున్నట్టే స్పెక్ట్రమ్‌ను వేలం వేయొద్దని, లైసెన్స్ ఇవ్వాలని స్టార్‌లింక్ ప్రభుత్వంతో మంతనాలు జరుపుతోంది. నేచురల్ రిసోర్స్‌లను కంపెనీలతో పంచుకుంటే మంచిదని ఈ కంపెనీ ప్రభుత్వానికి రాసిన లెటర్‌లో పేర్కొంది. వేలం వేయడం వలన జియోగ్రాఫికల్ రిస్ట్రిక్షన్లు పెరుగుతాయని, ఖర్చులు ఎక్కువవుతాయని వెల్లడించింది. రిలయన్స్ మాత్రం వేలం కచ్చితంగా ఉండాలని చెబుతోంది. ఫారిన్ శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్లు వాయిస్, డేటా సర్వీస్‌లను ఆఫర్ చేయొచ్చని, తమలాంటి ట్రెడిషనల్ టెలికం కంపెనీలతో పోటీ పడతాయని పేర్కొంది. వేలం వలన ఎవరికీ ఎక్కువ ఫేవర్ చేసినట్టు ఉండదని వెల్లడించింది. ప్రభుత్వం ఫారిన్ కంపెనీల డిమాండ్‌ను అంగీకరించకుండా, శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేసేలా రిలయన్స్ లాబీయింగ్ చేస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. కాగా, ఇంటర్నెట్ సర్వీస్‌లను శాటిలైట్ల ద్వారా అందించడాన్ని శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ అంటారు.
వేలమా? లైసెన్సా?
శాటిలైట్ స్పెక్ట్రమ్ వేలంపై కంపెనీలు, ఇండస్ట్రీ గ్రూప్‌లు, ఇతరుల నుంచి ప్రభుత్వం 64 రెస్పాన్స్‌లను అందుకుంది. కౌన్ అడ్వైజరీ ప్రకారం, ఇందులో 48 రెస్పాన్స్‌లు లైసెన్సింగ్‌కు, 12 ఓట్లు వేలానికి అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన రెస్పాన్స్‌లు న్యూట్రల్‌గా ఉన్నాయి. రిలయన్స్ మాత్రం లైసెన్సింగ్ విధానానికి వ్యతిరేకంగా ఉంది. స్టార్‌లింక్ వంటి పెద్ద కంపెనీలకు ఎటువంటి వేలం లేకుండా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఇస్తే అవి ఈజీగా విస్తరిస్తాయని రిలయన్స్ భయపడుతోంది. అమెజాన్ కూడా ఇలానే ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిందని, ప్రస్తుతం ఈ–కామర్స్ మార్కెట్‌లో పోటీలో సమానత్వం లేదని గుర్తు చేస్తోంది. రిలయన్స్ రిటైల్ అమెజాన్‌తో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. కానీ, ఈ–కామర్స్ సెక్టార్‌లో అమెజాన్ ముందుంది. డెలాయిట్ డేటా ప్రకారం, దేశంలోని శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ మార్కెట్ 2030 నాటికి ఏడాదికి 36 శాతం గ్రోత్ సాధించి రూ.16 వేల కోట్లకు చేరుకుంటుంది. ఇప్పటికే 84 దేశాల్లో తమకు అనుమతులు ఉన్నాయని, 15 లక్షల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని స్టార్‌లింక్ చెప్పుకుంటోంది. అమెజాన్ వచ్చే ఏడాది తమ మొదటి శాటిలైట్లను లాంచ్ చేస్తామని
ప్రకటించింది.
2021లో వద్దామనుకున్నా..
స్టార్‌లింక్ సర్వీస్‌లను 2021 లోనే ఇండియాలో లాంచ్ చేయాలని మస్క్ ప్రయత్నించారు. లైసెన్స్ లేకుండా బుకింగ్స్ కూడా ఓపెన్ చేయడంపై అప్పుటిలో రెగ్యులేటరీల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు జియో ఇండియాలోనే నెంబర్ వన్ టెలికం నెట్‌వర్క్ ప్రొవైడర్‌గా ఉంది. ఫారిన్ కంపెనీల నుంచి పోటీని ఎదుర్కోవడం కంపెనీకి ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. జియోకి ప్రస్తుతం 44 కోట్ల వైర్‌లెస్ యూజర్లు, 80 లక్షల మంది బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఉన్నారు. టెలికం మార్కెట్‌లో ఈ కంపెనీకి 25 శాతం వాటా ఉంది. అమెజాన్‌కు చెందిన శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్ కైపర్, బ్రిటిష్ ప్రభుత్వం–ఎయిర్‌టెల్ సపోర్ట్ ఉన్న వన్‌వెబ్‌లు కూడా స్టార్‌లింక్ మాదిరే వేలం వద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.