నిజామాబాద్ బీజేపీలో అసెంబ్లీ టికెట్​ కోసం పోటాపోటీ

  •  అర్బన్​లో 11 మంది.. 
  • ఆర్మూర్​లో 8 మంది తమకే టికెట్​ వస్తుందని లీడర్ల ధీమా

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో బీజేపీ టికెట్​ఆశిస్తున్నవారి సంఖ్య అధికంగానే ఉంది. అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్​ నియోజకర్గాల్లో తమకు ఛాన్స్​ ఇవ్వాలని 31 మంది లీడర్లు హైకమాండ్​కు అర్జీ పెట్టుకున్నారు. వీరిలో కొందరు గతంలో పోటీ చేయగా, మరికొందరు కొత్తవారు ఉన్నారు. ఎవరికి వారే తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీకి పెరిగిన బలంతో ఆశావహుల సంఖ్య ఎక్కువైంది.

అర్బన్​ నుంచి అధికంగా..

అర్బన్​ నుంచి  మొత్తం 11 మంది టికెట్​ఆశిస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్​పాల్​ సూర్యనారాయణతో పాటు జిల్లా ప్రెసిడెంట్​బస్వా లక్ష్మీనర్సయ్య, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్, యెండల సుధాకర్, గోపాల శర్మ, మీసాల శ్రీనివాస్, మీసాల సవిత, న్యాలం రాజు, సురేశ్​బాబు, గిరి యాదవ్, దొర్నాల రవి అర్జీలు పెట్టుకున్నారు. 

పార్టీకి చేసిన సేవలు, టికెట్​ఆశించడానికి కారణాలను దరఖాస్తులో ప్రస్తావించారు. వీరిలో పార్టీ అధిష్టానం ధన్​పాల్​సూర్యనారాయణ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య కూడా టికెట్​పై భరోసాతో ఉన్నారు.

ఆర్మూర్​లో..    

ఆర్మూర్​ నియోజకవర్గంలో బీజేపీకి క్యాడర్​ ఉంది. ఈ నియోజకవర్గ లీడర్లు జిల్లా స్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇక్కడి నుంచి ఎనిమిది మంది టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేశారు. ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న వ్యాపారవేత్త పైడి రాకేశ్​రెడ్డి, జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, జెస్సు అనీల్​కుమార్, మున్సిపల్ ​మాజీ చైర్మన్​ కంచెట్టి గంగాధర్, మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్ దివంగత ఆలూరు గంగారెడ్డి కూతురు ఆలూరు విజయభారతి, యమాద్రి భాస్కర్, మారంపల్లి గంగాధర్, నూతుల శ్రీనివాస్​రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నారు. వీరిలో ముగ్గురి పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

రూరల్​లోనూ పోటీయే..

రూరల్​ నియోజకవర్గం టికెట్​ కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు. కులాచారి దినేశ్​కుమార్​తో పాటు ఎంపీపీ గద్దె భూమన్న, కె.పెద్దారెడ్డి, టీపీ రెడ్డి, డాక్టర్ బిలోజీ నాయక్, ముబారక్​నగర్​కు చెందిన సందీప్​ అప్లికేషన్లు పెట్టారు. దినేశ్, గద్దె భూమన్న పేర్లను పార్టీ ముఖ్య లీడర్లు పరిశీలిస్తున్నారు. గిరిజన తండాలు అధికంగా ఉన్నందున గిరిజన కోటాలో తనకు ఛాన్స్​లభిస్తోందని డాక్టర్​ బిలోజీ నాయక్ ధీమాతో ఉన్నారు.   

బాల్కొండలో రెండే..

బాల్కొండ సెగ్మెంట్​నుంచి డాక్టర్ మల్లికార్జన్​రెడ్డి, రాయిడి రాజేశ్వర్​అప్లికేషన్లు పెట్టారు. రాజేశ్వర్​2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేశారు. మంత్రి ప్రశాంత్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంపై బీజేపీ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది.

బోధన్ ​నుంచి..

బోధన్​నుంచి తమకు ఛాన్స్​ఇవ్వాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్​రెడ్డి, వడ్డీ మోహన్​రెడ్డి అర్జీ పెట్టుకున్నారు. టికెట్​ఎవరికి వచ్చినా పరస్పరం మద్దతు ఇచ్చుకోవాలనే అవగాహనతో పనిచేస్తున్నారు. రెంజల్​జడ్పీటీసీ మేక విజయ మహిళా కోటాలో అవకాశం కోరుతున్నారు. స్టేట్​పార్టీ ఆఫీస్​లో కాలమిస్టుగా వ్యవహరించే ఎడపల్లి మండలానికి చెందిన శ్యాంసుందర్​టికెట్​ఆశిస్తూ అప్లికేషన్​పెట్టారు. పార్టీ ఇద్దరి పేర్లను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు సమాచారం.