హర్యానా కాంగ్రెస్​లో సీఎం సీటు కోసం పోటీ..

హర్యానా కాంగ్రెస్​లో సీఎం సీటు కోసం పోటీ..

 

  • రేసులో ముందున్న భూపిందర్ సింగ్ హుడా
  • అభ్యర్థుల ఎంపికలో తన మాటే నెగ్గించుకున్న హుడా
  • ప్రచారంలో రాహుల్ గాంధీ వెన్నంటి నడిచిన షెల్జా
  • సీఎం అభ్యర్థిని  హైకమాండే నిర్ణయిస్తుందంటున్న సూర్జేవాలా

చండీగఢ్, న్యూఢిల్లీ: కాంగ్రెస్​ గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో హర్యానా కాంగ్రెస్​లో సీఎం పదవికి పోటీ పెరిగింది. ముఖ్య నేతలు ఎవరికీ వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీ సీఎం, ప్రస్తుత సీఎల్పీ నేత భూపిందర్​సింగ్ హుడా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్​ అగ్రనేత, ఎంపీ కుమారి షెల్జా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు రణ్​దీప్​ సూర్జేవాలా వర్గాలు సీఎం పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 

అయితే, ఈ రేసులో రాష్ట్రంలోని అత్యంత ప్రభావవంతమైన జాట్ కులానికి చెందిన భూపిందర్​సింగ్ హుడా కొంత ముందున్నట్టు తెలుస్తోంది. దళిత వర్గానికి చెందిన కుమారి షెల్జా కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ విజయం గెలిస్తే రాష్ట్రానికి ఎవరు నాయకత్వం వహించాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ ఎన్నికల ప్రచారం సందర్భంగా కుమారి షెల్జా చేసిన వ్యాఖ్యలు సీఎం పదవీపై ఆమె ఆసక్తిని స్పష్టం చేస్తున్నాయి. 

మరోవైపు, ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించి హైకమాండ్​ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని, అందరూ దానిని అంగీకరించాల్సిందేనని హుడా తాజాగా పేర్కొన్నారు. సీనియర్ నాయకుడు రణ్‌‌దీప్ సూర్జేవాలా తనకు సీఎం పదవిపై ఆసక్తి ఉందని.. అయితే సీఎం ఎవరనేది పార్టీ హైకమాండే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

మాస్​లీడర్లకే చాన్స్ ఇస్తున్న హైకమాండ్​​

ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో, ఎలక్షన్ స్ట్రాటజీ రూపొందించడంలో హైకమాండ్ హుడాకు స్వేచ్ఛనిచ్చింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 70 మంది అభ్యర్థలు ఆయన సూచించిన వారే ఉన్నారు. ఈ స్థాయిలో హైకమాండ్​ ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే.. సీఎం పదవి కచ్చితంగా హుడానే వరిస్తుందని ఆయన వర్గం వాదిస్తున్నది. 

అలాగే గతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రాల్లో మాస్ లీడర్లకే అధికార పగ్గాలను అప్పగిస్తున్నదని..  రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌‌లో ఆ రాష్ట్ర మాజీ పీసీసీ ప్రతిభా సింగ్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ సుఖ్‌‌విందర్ సింగ్ సుఖును సీఎంగా ఎంపిక చేసింది. కర్నాటకలో కూడా సిద్ధరామయ్యకే సీఎంగా అవకాశం ఇచ్చారు. డీకే శివకుమార్​ను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. 

కాంగ్రెస్ లో చేరిన అనతి కాలంలోనే మాస్ లీడర్​గా ఎదిగిన రేవంత్ రెడ్డికి తెలంగాణ సీఎం పదవి ఇచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉండే సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ రేవంత్ వైపే మొగ్గు చూపారు. రాజస్థాన్​లో కూడా మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ను కాదని సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కు అత్యున్నత అధికారం అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ప్రజాదరణ కలిగి ఉండడం హుడాకు కలిసొచ్చే అంశం.

దళిత, మహిళా కార్డుతో షెల్జా

అభ్యర్థుల ఎంపికలో హుడాకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ సీనియర్ నేత షెల్జాకు ఈ ఎన్నికల్లో ఎక్కడా ప్రాధాన్యం తగ్గనివ్వలేదు. దళిత వర్గానికి చెందిన మహిళా నేతగా షెల్జా సీఎం పీఠం కోసం తన శక్తి యుక్తులన్నీ ఉపయోగిస్తున్నారు. ‘సేవ్ కాన్‌‌స్టిట్యూషన్’..  ఎంత జనాభాకు అధికారంలో అంత భాగస్వామ్యం అనే నినాదాలతో ఎన్నికల్లో ప్రచారం చేసిన పార్టీ షెల్జాకు ప్రాధాన్యం ఇస్తుందని ఆమె వర్గం నేతలు అంటున్నారు. 

హర్యానాలో 21 శాతం దళితులు ఉన్నారని.. కాంగ్రెస్ కు ఇంతటి ఊపు తీసుకురావడంతో ఆ వర్గంపాత్ర ఎంతో ఉందని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్​అంచనాలను రేపు నిజయం చేయడంతో తమ వర్గం ఓట్ల పాత్ర గణనీయమైందని అంటున్నారు. రాహుల్ గాంధీ కూడా ఎన్నికల సమయంలో ఢిల్లీలో షెల్జాతో సమావేశమై ఆమె చెప్పిన అంశాలను ఓపికగా విని వాటికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్తున్నారు. అలాగే రాహుల్​ ప్రతి సభలో, ఎన్నికల ర్యాలీలో ఆమెకు ప్రాముఖ్యం కల్పించారని అంటున్నారు.

అలసిపోలే.. రిటైర్ కాలే: హుడా

తాను అలసిపోలేదని.. రిటైర్ కాలేదని హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్​ తప్పకుండా గెలుస్తుందని, సీఎం ఎంపికపై హైకమాండ్‌‌దే తుది నిర్ణయమని చెప్పారు. ఎవరిని ఎంపిక చేసే చాన్స్ ఉందని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని, తుది నిర్ణయం ప్రకటిస్తారు. దానిని అంతా ఆమోదించాల్సిందే” అన్నారు.