మూడు స్థానాలు.. 25 దరఖాస్తులు..కాంగ్రెస్ ​టికెట్ కోసం తీవ్ర పోటీ

  •     చెన్నూరు నుంచి అత్యధిక దరఖాస్తులు.. 
  •     ఒకే స్థానం కోసంభార్యాభర్తలు అప్లై
  •     ఆశావహుల్లో నలుగురు డాక్టర్లు 
  •     గాంధీభవన్ చుట్టూ నేతల ప్రదక్షిణలు

కోల్​బెల్ట్​,వెలుగు : బీఆర్ఎస్ ​అభ్యర్థుల ప్రకటన పూర్తికావడంతో ఇప్పుడు జనాల దృష్టి మొత్తం కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపైనే ఉంది. ఎవరికి టికెట్లు ఇస్తారోనని జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా.. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టికెట్ కోసం ​తీవ్ర పోటీ నెలకొంది. మూడు నియోజకవర్గాల్లో పోటీ కోసం ఏకంగా 25 మందికి అప్లయ్​ చేసుకోవడం గమనార్హం. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఎస్సీ సీట్లు, మంచిర్యాల జనరల్ ​సీటు కావడంతో ఆశావహులు టికెట్​దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. 

బీఆర్ఎస్​ సర్కార్​పై వ్యతిరేకత, సిట్టింగ్​లపై అసంతృప్తి నేపథ్యంలో ఈ దఫా చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎవరికివారే ప్రజాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, అభివృద్ధి పనులు అసంపూర్తి ఉండటం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు సాగుతున్నారు.

స్థానికత, సామాజికవర్గంపై ఆశలు

టికెట్​ఆశిస్తున్న ఆశావహులు స్థానికత, తమ సామాజికవర్గంపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాలైన చెన్నూరు, బెల్లంపల్లి నుంచి మాల, మాదిగ, నేతకాని సామాజికవర్గానికి చెందిన వారి మధ్య పోటీ ఉంది. చెన్నూరులో ఈ మూడు సామాజిక వర్గాల ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు కులాల వారికే ప్రయారిటీ ఇస్తున్నారని ఈ దఫా తమకు కేటాయించాలని బెల్లంపల్లిలో మరో సామాజికవర్గం పట్టుబడుతోంది. 

ఒక నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తే మరోచోట అదే వర్గానికి ఛాన్స్​ఉండదని,ఈ అంశం తమకు కలిసివస్తుందని ఇతర సామాజికవర్గం లీడర్లు​ భావిస్తున్నారు. తాను స్థానికుడి నంటూ తననే గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారు.

చెన్నూరులో తీవ్రం పోటీ..

చెన్నూరులోలో బీఆర్​ఎస్ నుంచి మళ్లీ​బాల్క సుమన్​పోటీలో ఉండడంతో ఆయనపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్​లీడర్లు ఆసక్తిచూపుతున్నారు. దీంతో చెన్నూరు నుంచే అత్యధికంగా 12 మంది టికెట్​కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మాజీ మంత్రి బోడ జనార్ధన్, నూకల రమేశ్, సోత్కు సుదర్శన్, రామిళ్ల రాధిక, గొమాస శ్రీనివాస్, దుర్గం భాస్కర్, దుర్గం నరేశ్, మేకల శంకర్, దుర్గం అశోక్ దరఖాస్తు చేసుకున్నారు. 

మందమర్రికి చెందిన డాక్టర్​ దాసారాపు శ్రీనివాస్, ఆయన సతీమణి డాక్టర్​ విద్యావర్థిని సైతం చెన్నూర్​ టికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్థానికుడినైన తనకు గానీ, తన భార్యకు గానీ టికెట్​ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. సింగరేణి డాక్టర్​గా కొనసాగిన రాజారమేశ్​ సైతం టికెట్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతూ టికెట్ కోసం అప్లై చేసుకున్నారు.​ 

తనకే టికెట్ ఇవ్వాలని..

మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోనూ పోటీ నెలకొంది. మంచిర్యాల టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు, సీనియర్​లీడర్లు కేవీ ప్రతాప్, డాక్టర్​ నీలకంఠేశ్వర్, వంగల దయానంద్, శ్రీరాంభట్ల భరత్, మందమర్రికి చెందిన పాషా దరఖాస్తు చేసుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్, నాతారి స్వామి, చిలుముల శంకర్, రొడ్డ శారద, ముడిమడుగుల మహేందర్, చొప్పదండి దుర్గాభవాని, కాంపెల్లి ఉదయ్​కాంత్​ టికెట్​ కోసం దరఖాస్తులిచ్చారు. 

తమ మద్దతుదారులతో కలిసి వీరంతా టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు గాంధీ భవన్​వద్ద ప్రధాన నేతలను కలుస్తూ టికెట్ తమకే దక్కేలా పావులు కదుపుతున్నారు.