- ఇక్కడ నలుగురు.. అక్కడ నలుగురు.. జోరుగా పైరవీలు
- పార్టీ హైకమాండ్దృష్టిలో పడేలా పక్కా ప్రణాళికలు
- ప్రజలకు దగ్గరయ్యేందుకు పలు కార్యక్రమాలు
మెదక్, వెలుగు : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. ‘బరిలో ఉండేది నేను అంటే నేనే’ అని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రెండు సెగ్మెంట్లలో నలుగురు అభ్యర్థుల చొప్పున పలువురు టికెట్ఆశిస్తున్నారు. అందుకు పైరవీలు సైతం చేసుకుంటున్నారు. ఇటు పార్టీ హై కమాండ్ దృష్టిలో పడేందుకు, అటు ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పర్యటనలు, సేవా కార్యక్రమాలు ప్రచారాన్ని తలపించేలా చేపడుతున్నారు. పోటాపోటీ పర్యటనలతో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడర్ల రాజకీయం కాక పుట్టిస్తోంది.
మెదక్ లో..
మెదక్ నియోజకవర్గంలో డీసీసీ ప్రెసిడెంట్కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, టీపీసీసీ నాయకులు చౌదరి సుప్రభాత్ రావు, మ్యాడం బాలకృష్ణ కాంగ్రెస్ నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడైన తిరుపతిరెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ‘గడప గడపకు కాంగ్రెస్’ పేరుతో ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్‌లో జాయిన్ చేసుకోవడంపై ఆయన దృష్టి పెట్టారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి ఆర్థికసాయం చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మెదక్ లో క్యాంప్ ఆఫీస్, నాయకులు, కార్యకర్తల సౌకర్యార్థం షెడ్ ఏర్పాటు చేశారు.
బీజేపీని వీడి తిరిగి హస్తం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి చాపకింద నీరులా పట్టుపెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నియోజకవర్గంలో తనకున్న పరిచయాల ద్వారా నాయకులు, కార్యకర్తల మద్దతు కూడగట్టుకుంటున్నారు. సుప్రభాత్ రావు వివిధ కార్యక్రమాల ద్వారా పార్టీ హైకమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలకృష్ణ బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, పలు సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. కాగా ఈసారి టికెట్తనకే వస్తోందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నర్సాపూర్‌లో...
నర్సాపూర్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ టికెట్ రేసులో నలుగురు లీడర్లు ఉన్నారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ఇన్చార్జి గాలి అనిల్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకుడు సోమన్నగారి రవీందర్ రెడ్డి బరిలో దిగేందుకు పోటీ పడుతున్నారు. ఆవుల రాజిరెడ్డి చాలా రోజుల నుంచే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాలకు విధిగా హాజరవుతున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అన్ని మండలాల్లో వాల్ రైటింగ్ సైతం చేయించారు. ఆంజనేయులు గౌడ్, రవీందర్ రెడ్డి పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల విజయవంతానికి ఎవరికి వారు కృషి చేస్తున్నారు. ప్రజల, రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతు ఆయా వర్గాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గాలి అనిల్ కుమార్ ఇది వరకు పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనే ఎక్కువగా పాల్గొనగా, ఇప్పుడు తన రూట్ మార్చారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగతంగా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం చేస్తూ పార్టీ హైకమాండ్, ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏదేమైనా జిల్లాలోని కాంగ్రెస్‌లో లీడర్ల పర్యటనలతో ఇప్పుడే ఎన్నికల వాతావరణం తలపిస్తోంది.