ఎల్లారెడ్డి లో నువ్వా? నేనా? కాంగ్రెస్​ టికెట్ ​కోసం పోటాపోటీ

కామారెడ్డి, వెలుగు:  ఎల్లారెడ్డి కాంగ్రెస్​ టికెట్​కోసం పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​కె.మదన్​మోహన్​రావు, పీసీసీ జనరల్​సెక్రటరీ వడ్డేపల్లి సుభాష్​రెడ్డి సై అంటే సై అంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ ప్రోగ్రామ్స్​ను ఎవరికి వారే నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గులాబీ హవా కొనసాగినా, ఎల్లారెడ్డి ప్రజలు మాత్రం కాంగ్రెస్​కే పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలోని 9  నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ పార్టీ గెలిచిన ఏకైక సీటు ఎల్లారెడ్డినే. అప్పట్లో కాంగ్రెస్​నుంచి పోటీ చేసిన జాజుల సురేందర్​ బీఆర్ఎస్ ​అభ్యర్థిపై 35,148 ఓట్ల మెజార్టీ సాధించారు. 

ఆ దఫా ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​కు అత్యధిక మెజార్టీ లభించింది ఇక్కడే. ఆ తర్వాత కొన్ని రోజులకే జాజుల కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ ​తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి సత్తాచాటాలని కె.మదన్​మోహన్​రావు, సుభాష్​రెడ్డి ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు నాయకులు తమకే టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. వడ్డేపల్లి సుభాష్​రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్​రేవంత్​రెడ్డితో పాటు, ఇతర ముఖ్యనేతల్ని నమ్ముకోగా, కె.మదన్​మోహన్​రావు ఢిల్లీలో రాహుల్​గాంధీ టీమ్​తో పాటు, స్టేట్​లోని కొందరు సీనియర్ ​నేతలపై భరోసా ఉంచారు.

నియోజకవర్గంలో పట్టు కోసం..

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్​ పార్టీకి మంచి ఓటు బ్యాంక్​ఉంది. 2018 ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థికి 91,510 ఓట్లు వచ్చాయి. 2014లోనూ 46,751 ఓట్లు వచ్చాయి. కొన్నేండ్లుగా నియోజకవర్గంలో ఈ ఇద్దరు నాయకులు ఎవరికి వారే ప్రోగ్రామ్స్, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గంపై పట్టుపెంచుకునే ప్రయత్నం చేశారు. పీసీసీ ప్రకటించిన ప్రోగ్రామ్స్, ఆందోళనల్ని సైతం వేర్వేరుగా నిర్వహించారు. ఇతర పార్టీలకు చెందిన లీడర్లు, కార్యకర్తల్ని కూడా విడివిడిగా తమ వర్గాల్లో చేర్చుకుంటూ బలాన్ని పెంచుకుంటున్నారు. గత పార్లమెంట్​ఎన్నికల్లో పోటీ చేసిన కె.మదన్​మోహన్​రావు  స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంపైనే పూర్తి ఫోకస్​పెట్టారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడే ప్రోగ్రామ్స్, పర్యటనలు చేశారు. వడ్డేపల్లి సుభాష్​రెడ్డి, రేవంత్​రెడ్డితో పాటు కాంగ్రెస్​లో చేరారు. 2018 ఎన్నికల్లో టికెట్​ఆశించగా, జాజుల సురేందర్​కు పార్టీ టికెట్​ఇచ్చింది. ఆ తర్వాత జాజుల పార్టీ మారాడంతో, వడ్డేపల్లి సుభాష్​రెడ్డి కూడా ఎల్లారెడ్డిపైనే దృష్టి సారించారు. 

ఎవరి ధీమా వారిదే..


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున పోటీకి నలుగురు అప్లయ్​ చేసుకున్నారు. ఇందులో వడ్డేపల్లి సుభాష్​రెడ్డి, కె.మదన్​మోహన్​రావు, ఆకుల శ్రీనివాస్, రాజేశ్వర్​రెడ్డి ఉన్నారు. ఇందులో నుంచి స్ర్కీనింగ్ కమిటీ కె. మదన్​మోహన్​రావు, వడ్డేపల్లి సుభాష్​రెడ్డి పేర్లను హైకమాండ్​కు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కూడా టికెట్​ తమకే వస్తుందనే అనుచరులు, పార్టీ శ్రేణులకు చెబుతున్నారు.