కేతకీ పీఠం ఎవరికో..?

 కేతకీ పీఠం ఎవరికో..?
  • ధర్మకర్త మండలి కోసం నోటిఫికేషన్ రిలీజ్
  • పాలక వర్గం లేక కుంటుపడిన ఆలయ అభివృద్ధి
  • ఇన్​చార్జి ఈవోతో ఆలయ పర్యవేక్షణ
  • చైర్మన్ ​రేసులో భారీగా ఆశావహులు

సంగారెడ్డి/ఝరాసంగం, వెలుగు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ పాలకవర్గ పదవులకు పోటీ పెరిగింది. దేవస్థానం ధర్మకర్త మండలి కోసం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. సంగమేశ్వర ఆలయానికి ప్రతి ఏడాది వివిధ రూపాల్లో రూ.4 కోట్ల ఆదాయం వస్తుంది. గతేడాది అక్టోబర్ లో పాలకవర్గ పదవీకాలం ముగియగా ఇప్పటివరకు కొత్త పాలకవర్గం ఏర్పాటు కాలేదు. 

దాదాపు 13 నెలల పాటు ఇన్​చార్జి ఈవోతో ఆలయ పర్యవేక్షణ కొనసాగుతూ వచ్చింది. ఆలయానికి మన రాష్ట్రంతో పాటు కర్నాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు వస్తుంటారు. శ్రావణం, కార్తీక మాసం, సోమవారం, ప్రతి అమావాస్యతో పాటు ఇతరత్రా సెలవు రోజుల్లో కేతకీ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. 

గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం

పదేళ్ల బీఆర్​ఎస్​ప్రభుత్వం హయాంలో ఐదేళ్లపాటు కేతకీ ఆలయానికి ధర్మకర్త మండలి  లేకుండానే ఆలయ నిర్వహణ కొనసాగింది. ఉమ్మడి రాష్ట్రంలో కేతకీ ఆలయ పాలకవర్గం పదవి కాలం రెండేళ్లు ఉండగా, తెలంగాణ ఏర్పాటుతో అప్పటి సీఎం కేసీఆర్ దాన్ని ఏడాదికి తగ్గించారు. 6ఎ గ్రేడ్​ స్థానం కలిగి ఆర్​జేసీ పరిధిలో ఉన్న ఆలయానికి భారీగానే ఆదాయం వస్తున్నప్పటికీ పాలకవర్గం లేకపోవడంతో దేవాలయ అభివృద్ధి కుంటుపడుతూ వచ్చింది. 

సిబ్బంది కొరతతో పాటు రెగ్యులర్​ ఈవో లేకపోవడం సమస్యగా మారింది.  జూనియర్​, సీనియర్​ అసిస్టెంట్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంతకాలం ఇన్​చార్జి ఈవోతోనే నెట్టుకొస్తున్నారు. గతంలో ఆలయ అభివృద్ధికి మాస్టర్​ప్లాన్​ సిద్ధం చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టలేక పోయారు. కనీసం ఇప్పుడైనా కొత్త పాలకవర్గం చైర్మన్, సభ్యులు ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

పెరుగుతున్న ఆశావహులు

కేతకీ సంగమేశ్వర ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్, ధర్మకర్త పదవుల కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో స్థానిక కాంగ్రెస్​నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. చైర్మన్​ పదవి కోసం ఎక్కువమంది ప్రయత్నిస్తున్నప్పటికీ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్ ఆశీస్సులు ఉన్న వారికే పదవులు దక్కనున్నాయి. ఆలయ మాజీ చైర్మన్​ దేవరంపల్లికి చెందిన మల్లన్నపటేల్​ కాంగ్రెస్ సీనియర్ నేత ఉజ్వల్ రెడ్డి ద్వారా మంత్రి దామోదర​వద్ద ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈదుల్​పల్లికి చెందిన శేఖర్ మంత్రి ద్వారా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కమాల్​పల్లి మాజీ సర్పంచ్​సంగ్రామ్​పటేల్​, క్రిష్ణాపూర్​మాజీ సర్పంచ్​బస్వరాజ్, ​ఎల్గోయి గ్రామానికి చెందిన సీనియర్​ నాయకుడు వీర్​షెట్టి, జహీరాబాద్ ఎంపీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. -------------