- ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రి పదవికీ పోటాపోటీ
- షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి మధ్య టఫ్
నిజామాబాద్, వెలుగు : రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు ఖాయమనే ప్రచారంజరుగుతుండటంతో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కనుందనే విషయం ఉత్కంఠగా మారింది. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి బెర్తు ఖాయమని భావిస్తుండగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలియడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న షబ్బీర్‌అలీ ఢిల్లీ స్థాయిలో ఆయన ఇంకా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
పార్టీ బీఫారంపై గెలిచిన ఎమ్మెల్యేలనే క్యాబినెట్లో తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి వస్తుందనే ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ పదవికి జిల్లా మాజీ ఎంపీ మధుగౌడ్ యాష్కీ, ఇందూరు వాసి ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ రేసులో ఉండడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ఒకరా.. ఇద్దరా..?
గత అసెంబ్లీ ఎలక్షన్లో ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. మొదటి విడత మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో బోధన్ సెగ్మెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సుదర్శన్‌రెడ్డి 2009 నుంచి 2014 దాకా అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశారు. ఎల్లారెడ్డి, జుక్కల్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంత్‌రావు, డాక్టర్ భూపతిరెడ్డి అసెంబ్లీకి మొదటిసారి ఎన్నికయ్యారు. సీనియారిటీ ఇతర అంశాలు సుదర్శన్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డికి దగ్గరి బంధువు కూడా కావడంతో విస్తరణలో చోటు పక్కా అని తెలుస్తోంది. అయితే ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో పట్టుదలతో ఎన్నికల టికెట్ తెచ్చుకొని గెలిచిన మదన్మోహన్రావు కూడా మినిస్టర్ పదవి ఆశిస్తూ తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కోసం కామారెడ్డి సెగ్మ్ంట్ వదులుకొని ఎన్నికలప్పుడు అర్బన్‌లో పోటీ చేసి ఓటమి చెందిన షబ్బీర్‌అలీ పట్ల సీఎంకు ప్రత్యేక అభిమానం ఉంది. మైనారిటీ కోటాలో ఆయన్ను మంత్రివర్గంలో తీసుకోవాలని ఢిల్లీ పెద్దలను ఇటీవల కలిసినప్పుడు సీఎం సిఫార్సు చేశారన్న వాదన వినిపిస్తోంది.
పార్టీ బీఫారంతో గెలిచిన ఎమ్మెల్యేలనే క్యాబినెట్లో తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పట్ల పార్టీ క్యాడర్లో క్లారిటీ వచ్చేసింది. చివరి దాకా సమీకరణలు ఎవరికి అనుకూలిస్తాయోననే టెన్షన్ క్రియేట్ అయింది. రెండు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉండడంతో ఉత్కంఠ నెలకొంది.
ప్రెసిడెంట్ పోస్టుకు ప్రయారిటీ
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీపీసీసీ ప్రెసిడెంట్ పదవికి మంచి ప్రయారిటీ ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ మంత్రివర్గంలో స్థానం కంటే పార్టీ అధ్యక్ష కుర్చీ వైపే మొగ్గు చూపుతున్నారు. 2004 నుంచి పదేండ్లు జిల్లా ఎంపీగా ఉన్న మధుయాష్కీ గౌడ్ కూడా ప్రెసిడెంట్ పదవి పట్ల ఆసక్తితో ఉన్నారు. స్టేట్‌లోని ఇతర నేతలతో పాటు బీసీ లీడర్లుగా జిల్లాతో అనుబంధమున్న ఈ ఇద్దరు లీడర్లు టీపీసీసీ పదవికి పోటీపడుతున్నారు.