- కేయూ జేఏసీ నుంచి జోరిక రమేశ్, బొల్లికొండ వీరేందర్, బైరి నిరంజన్
- టికెట్ తమకు ఇవ్వాలని హైకమాండ్‌ను కలుస్తున్న అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య
- మూడోసారి కూడా టికెట్ నాదే అంటున్న సిట్టింగ్ ఎంపీ పసునూరి
వరంగల్, వెలుగు : వరంగల్ ఎస్సీ పార్లమెంట్ సీటు కోసం బీఆర్‌ఎస్‌లో ఉద్యమకారులు, మాజీ ఎమ్మెల్యేలు నడుమ పోటీ నెలకొంది. టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారుగా తమ గాడ్‌ఫాదర్ల సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు మూడో సారి కూడా తానే బరిలో ఉంటానని సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సారైనా కేయూ ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని పలువురు జేఏసీ లీడర్లు పార్టీ పెద్దలను కలుస్తున్నారు.
ప్రతీసారి నిరాశే..
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ కంటే ముందే కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా జేఏసీగా ఏర్పడి పోరాటానికి దిగారు. బీఆర్‌ఎస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఉంటుందని భావించారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ చెందిన సుమారు 20 మందికి వివిధ పదవులు దక్కగా, కేయూకు చెందిన ఒకరిద్దరికే పదవులు వచ్చాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రతీసారి కేయూ జేఏసీ లీడర్ల పేర్లను పరిశీలించాలని కోరుతూనే ఉన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తమకు ఛాన్స్ ఇవ్వాలని లీడర్లు రోడ్డెక్కినా ఫలితం లేకుండా పోయింది. త్వరలో ఎంపీ ఎలక్షన్స్ జరగనున్నందున వరంగల్ ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలంటూ పలువురు నాయకులు ఇప్పటికే హైకమాండ్‌ను కలిశారు. ఇందులో కేయూ లీడర్ స్థాయి నుంచి కార్పొరేటర్‌గా ఎదిగిన జోరిక రమేశ్, ఉద్యమ టైంలో 100 కేసులకు పైగా ఉన్న డాక్టర్ బొల్లికొండ వీరేందర్, డాక్టర్ బైరి నిరంజన్‌తో పాటు మరో కార్పొరేటర్ బోడ డిన్నా ప్రయత్నాలు చేస్తున్నారు.
రేసులో మాజీ ఎమ్మెల్యేలు అరూరి, తాటికొండ
బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వరంగల్ ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో హరీశ్‌రావు తర్వాత అత్యధిక మెజార్టీతో గెలిచిన రమేశ్ ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీ రిజర్డ్వ్ కావడంతో మరో సారి అదృష్టం పరిశీలించుకునేందుకు రెడీ అవుతున్నారు.
వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉండటానికి తోడు మిగతా లీడర్లతో సఖ్యతతో పాటు, సొంతంగా బలం, ఆర్థిక వనరులు ఉన్నాయి. దీంతో టికెట్ కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మరో వైపు స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఎమ్మెల్యే టికెట్‌కు బదులుగా రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో ఆ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఎంపీ టికెట్ విషయంలో తన పేరు పరిశీలించాలని ఆయన కోరుతున్నారు. వీరికి తోడుగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య సైతం టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మూడోసారి టికెట్ నాదే అంటున్న పసునూరి
వరంగల్ ఎంపీగా బీఆర్‌ఎస్ తరఫున మూడోసారి కూడా తానే బరిలో ఉంటానని సిట్టింగ్ పసునూరి దయాకర్ ధీమాగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ప్రెస్‌మీట్‌లో సైతం చెప్పారు. గతంలో గ్రూప్ తగాదాలు ఉండొద్దనే నియోజకవర్గాల్లో తిరగలేదని, బండి సంజయ్, రేవంత్‍రెడ్డి కంటే తానే ఎక్కువగా అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు. ఉద్యమకారుడిగా, రెండు సార్లు ఎంపీగా పార్టీ లైన్ దాటకుండా పనిచేశానని, దీంతో ఈ సారి కూడా తనకే అవకాశం వస్తుందని అంటున్నారు.