కాంగ్రెస్​ లో టికెట్​ ఎవరికో!.. బీసీలకు సర్దుబాటుపై చర్చలు

కాంగ్రెస్​ లో టికెట్​ ఎవరికో!.. బీసీలకు సర్దుబాటుపై చర్చలు
  • సెప్టెంబరు ఒకటి నుంచి నియోజకవర్గాలకు ​సర్వే టీంలు

మహబూబ్​నగర్, వెలుగు :  కాంగ్రెస్​లో టికెట్ల పంచాయితీ మొదలైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 57 మంది  అప్లై చేసుకోవడంతో పోటీ తీవ్రమైంది. ఇందులో అత్యధికంగా పాలమూరు అసెంబ్లీ సీటు కోసం ఏడుగురు పోటీ పడుతుండగా, అచ్చంపేట నుంచి చిక్కుడు వంశీకృష్ణ దంపతులు,  కొడంగల్ నుంచి రేవంత్​రెడ్డి, అలంపూర్​ నుంచి సంపత్​ కుమార్ ఒక్కొక్కరే అప్లై చేసుకున్నారు. మిగతా సెగ్మెంట్లలో నలుగురు నుంచి ఐదారుగురు పోటీ పడుతుండటంతో ఎవరికి టికెట్​ వస్తోందనని సస్పెన్స్​  నెలకొంది. ఇందులో ఎవరికి టికెట్​ ఇవ్వాలి? సీనియర్లు ఉన్న చోట్ల పరిస్థితిని ఎలా చక్కబెట్టాలి? ఒక పార్లమెంటు పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలనే ఇక్వేషన్స్ ఉండటంతో.. ఈ సీట్లను ఎక్కడ సర్దుబాటు చేయాలనే విషయాలపై పార్టీ హైకమాండ్​ ఫోకస్​ పెట్టింది.

 క్యాండిడేట్లపై సర్వేలు..

టికెట్​కోసం అప్లై చేసుకున్న వారందరి గురించి కాంగ్రెస్​ హైకమాండ్​ సర్వేలు నిర్వహించనుంది. రెండు మూడు రోజుల్లో సర్వే టీంలు నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామానికి వెళ్లి, అభ్యర్థుల గురించి డీప్​గా ఎంక్వైరీ చేయనున్నాయి. దాదాపు 20 మంది చొప్పున ఒక్కో టీంలో ఉండబోతున్నట్లు సమాచారం. సర్వేల్లో భాగంగా అభ్యర్థికి నియోజకవర్గంలో ఉన్న పేరు, ప్రతిష్టలు, ఆర్థిక బలం , సామాజిక సమీకరణలు, రూలింగ్​ పార్టీ అభ్యర్థికి దీటుగా ఎవరు పోటీ ఇవ్వగలరు? తదితర అంశాలకు సంబంధించి ఓటర్లతో నేరుగా ఈ సర్వే టీంలు చర్చించి శ్యాంపిల్స్​ సేకరించనున్నాయి. అనంతరం సర్వే రిపోర్ట్​ను హైకమాండ్​కు అందజేయనుంది. ఆ రిపోర్ట్​ ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉండనున్నాయని తెలిసింది.

బీసీలకు పెరగనున్న సీట్లు

ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో ఇద్దరు బీసీలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్​ హైకమాండ్​ డిసైడ్​ చేసింది. దీంతో నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ పరిధిలో రెండు స్థానాలను ఎలా సెట్​ చేయాలనే దానిపై కన్​ఫ్యూజ్​లో ఉంది. ఈ పార్లమెంట్​లో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా, అందులో రెండు ఎస్సీ రిజర్వ్​ ఉన్నాయి. మిగతా ఐదు చోట్ల రెండు స్థానాలను బీసీలకు సర్దుబాటు చేయాల్సి ఉంది. వీటిలో గద్వాలలో మాత్రమే బీసీలకు ఇవ్వాలనే చర్చ నడుస్తున్నట్లు సమాచారం. ఇక్కడ బీసీలకు ఒక స్థానం కేటాయించి మరో స్థానాన్ని మహబూబ్​నగర్​ పార్లమెంట్​ పరిధిలో భర్తీ చేస్తారనే టాక్​ నడుస్తోంది. 

ఈ పార్లమెంట్​లో 13.35 లక్షల మంది ఓటర్లు ఉండగా, దాదాపు 52 శాతం నుంచి 54 శాతం వరకు బీసీ ఓటర్లు ఉన్నారు. దీంతో ఇక్కడ దాదాపు మూడు నుంచి నాలుగు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొడంగల్, జడ్చర్ల అసెంబ్లీ స్థానాలను మినహాయించి మహబూబ్​నగర్​, నారాయణపేట, మక్తల్​, దేవరకద్ర, షాద్​నగర్​ అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజార్టీ చోట్ల ఈ స్థానాల్లో బీసీలను రంగంలోకి దింపే ఇక్వేషన్స్​ను ఇంప్లిమెంట్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

'పాత-కొత్త' లీడర్ల మధ్య కుదరని సయోధ్య

మొన్నటి వరకు జడ్చర్ల అసెంబ్లీలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్​ మధ్య టికెట్​ విషయమై పోటీ ఉండేది. అయితే, ఇటీవల వీరిద్దరి మధ్య రాజీ కుదిరిందనే టాక్​ నడుస్తోంది. ఇందులో భాగంగా ఎర్ర శేఖర్​ను నారాయణపేట నుంచి పోటీ చేయాలని ప్రపోజ్​ పెట్టినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కానీ వనపర్తి, గద్వాల, కొల్లాపూర్​, నాగర్​కర్నూల్​ అసెంబ్లీ సెగ్మెంట్లలో 'పాత,-కొత్త' లీడర్ల మధ్య వార్​ సద్దుమణగడం లేదు. ఎవరికి వారు ప్రెస్​మీట్లు పెట్టుకొని తామే పోటీలో ఉంటామంటూ ప్రకటనలు చేస్తున్నారు. వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అయితే, త్వరలో ఈ నాలుగు సెగ్మెంట్లలో లీడర్లందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కర్ణాటకకు చెందిన ఓ 'కీ' లీడర్​తో పాటు రాష్ర్టానికి చెందిన లీడర్లు సమావేశం కానున్నట్లు సమాచారం.