ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ..జోగులాంబ టెంపుల్ కమిటీకి పోటాపోటీ సిఫారసు లేఖలు

ఎమ్మెల్యే వర్సెస్  ఎమ్మెల్సీ..జోగులాంబ టెంపుల్  కమిటీకి పోటాపోటీ సిఫారసు లేఖలు

గద్వాల, వెలుగు: అలంపూర్  నియోజకవర్గంలోని ఐదో శక్తి పీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్  కమిటీ ఏర్పాటు బీఆర్ఎస్  పార్టీలో చిచ్చు రేపుతోంది. ఇప్పటికే వర్గ విభేదాలతో సతమతమవుతున్న పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా కలవని వర్గాల మధ్య టెంపుల్  కమిటీ ఏర్పాటుతో మరింత దూరం పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది. టెంపుల్ కమిటీ పదవులకు ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు సిఫారసు లెటర్లు ఇచ్చారు. తమ పంతం నెగ్గించుకునేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హైదరాబాద్​లో తిష్ట వేయడం అలంపూర్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పంతం నెగ్గించుకునేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ఎమ్మెల్యే వర్గం నుంచి తనగల సీతారాంరెడ్డికి ఇప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుండగా, ఎమ్మెల్సీ వర్గం అలంపూర్  మండలంలోని కోనేరు కృష్ణయ్యకు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

చైర్మన్  సీట్ కు ఫుల్ డిమాండ్..

ఆలయ కమిటీ చైర్మన్  సీటుకు ఫుల్  డిమాండ్  ఉంది. చైర్మన్ పదవి కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. వారిలో ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నవారినే చైర్మన్  పదవి వరిస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యే ఒకరిని ప్రపోజ్ చేయగా, ఎమ్మెల్సీ మరొకరిని ప్రపోజ్  చేయడంతో రచ్చ మొదలైంది. భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న వారికి, టెంపుల్  డెవలప్​ చేస్తారన్న వారికి ఇవ్వాల్సిన చైర్మన్ పదవిలో రాజకీయాలు చోటు చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. లీడర్లు తమ అనుచరులకు ఇప్పించుకొని గుడిని కూడా రాజకీయం చేసేస్తున్నారనే విమర్శలున్నాయి.

ఎన్ వోసీ రాకుండా కొర్రీలు..

టెంపుల్ కమిటీ చైర్మన్  కావాలన్నా, కమిటీ సభ్యుడు కావాలన్నా ఎండోమెంట్  చట్టం ప్రకారం ఎలాంటి కేసులు ఉండకూడదు. అలాగే ఎండోమెంట్  ఉద్యోగులతో బంధుత్వం, ఎండోమెంట్ భూములను లీజుకు తీసుకొని ఉండవద్దు. పోలీసులు నో అబ్జెక్షన్  సర్టిఫికెట్​ ఇవ్వాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ వర్గానికి చెందిన వారికి పోలీసులు ఎన్ వోసీ లెటర్లు ఇవ్వకుండా రెండు రోజులుగా ఎమ్మెల్యే వర్గం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్సీ వర్గం ఉన్నతాధికారులకు కంప్లైంట్  చేసి సోమవారం రాత్రి ఎన్​వో సీల కోసం అప్లై చేశారు.

ఎమ్మెల్యే వర్గాన్ని అవమానిస్తున్రు..

రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనివిధంగా అలంపూర్​లో గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఎమ్మెల్యే వర్గం నేతలు వాపోతున్నారు. దళిత ఎమ్మెల్యే కావడంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారికి చైర్మన్  పదవి ఇవ్వకపోతే, తాము రాజీనామాలు ఆలోచన చేయాల్సి వస్తుందని బహిరంగంగానే చెబుతున్నారు.

ఎమ్మెల్సీ లిస్టు ఓకే చేసినట్లు లీకులు..

ఆలయ పాలకవర్గ పదవీకాలం మార్చి 28తో ముగిసింది. నోటిఫికేషన్  వెలువడిన 40 రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులోభాగంగా ఎమ్మెల్యే తన అనుచరుడైన తనగల సీతారాంరెడ్డిని కమిటీ చైర్మన్​ చేయాలని సిఫార్సు లెటర్  ఇచ్చి సీఎం కేసీఆర్  ఆశీస్సులు తీసుకొని వచ్చారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి బీసీ వర్గానికి చెందిన తన అనుచరుడు, గత కమిటీలోమెంబర్ గా ఉన్న కోనేరు కృష్ణయ్యను చైర్మన్, 14 మంది సభ్యులతో సిఫారసు లెటర్  ఇచ్చారు. ప్రభుత్వం కూడా ఎమ్మెల్సీ పంపిన లిస్టుకే మొగ్గు చూపుతుందనే లీకులు రావడంతో ఎమ్మెల్యే వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.