సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ త్రీ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. గేమ్ చేంజర్ సినిమా, అదనపు షోలు, టికెట్ల రేటు పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 500 కోట్లు తీసుకున్నారంటూ కౌశిక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఎంపై నిరాధార ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు భాస్కర్ రెడ్డి. గేమ్ ఛేంజర్ సినిమాకు అదనపు షోలు, టికెట్ల రేటు పెంచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం తర్వాత హైకోర్టు తీర్పుతో రద్దు చేసిన సంగతి తెలిసిందే.
కౌశిక్ రెడ్డిపై మరో మూడు కేసులు
కరీంనగర్ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే సంజయ్ తో గొడవకు దిగిన ఘటనలో కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారని..ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు పోలీసులు. ఇక సమావేశంలో గందరగోళం సృష్టించారని ఆర్డీవో మహేశ్వర్.. తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన కంప్లైంట్లపై..పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.