ఆమనగల్లు, వెలుగు: కడ్తాల్ మండలంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్ యాజమాన్యం తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమి తమదేనని వేధింపులకు గురి చేస్తోందని, యాజమాన్యంపై చర్యలు తీసుకొని భూ సమస్య పరిష్కరించాలని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ కు గిరిజనులు ఫిర్యాదు చేశారు. కొల్లాపూర్ పర్యటనకు వెళ్తున్న ఆయనకు ఆదివారం కడ్తాల్, ఆమనగల్లు మండలకేంద్రాల్లో బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
మైసిగండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమనగల్లులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులు భరత్ ప్రసాద్, కల్యాణ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, కౌన్సిలర్లు చెన్నకేశవులు, కృష్ణా నాయక్, లక్ష్మణ్, దివ్య శ్రీకాంత్ సింగ్, జ్యోతి నరసింహ, యాదమ్మ, శ్రీశైలం యాదవ్, సుజాత, రాములు నాయక్, విక్రం రెడ్డి పాల్గొన్నారు.