కరీంనగర్, వెలుగు: చొప్పదండి బీఆర్ఎస్ అసమ్మతి పంచాయతీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోర్టుకు చేరింది. చొప్పదండి బీఆర్ఎస్ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు అసమ్మతి నేతలు మంత్రి కేటీఆర్ ను శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో కలవడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ప్రకటనకు ముందే నియోజకవర్గంలోని ముఖ్య నాయకులంతా కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఒకసారి ఎమ్మెల్యే సమక్షంలోనే వారిని పిలిచి కరీంనగర్ లోని ఓ హోటల్ లో మాట్లాడి సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా అసమ్మతి చల్లారలేదు. అంతేకాకుండా బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీటీసీ బండపల్లి యాదగిరి.. తాను పోటీలో ఉండబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయనకు చొప్పదండి, బోయిన్ పల్లి, రామడుగు, గంగాధర మండలాలకు చెందిన కొందరు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు మద్దతుగా నిలిచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యే రవిశంకర్ వెంట ఉంటున్న నాయకులే ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ మంత్రి కేటీఆర్ ను కలవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
మంత్రి కేటీఆర్ కు అసమ్మతి నేతల ఫిర్యాదు
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చొప్పదండి గెలుపు బాధ్యతలను మంత్రి గంగుల కమలాకర్ కు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో అసమ్మతి వర్గాన్ని బుజ్జగించడం ఆయనకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే వారిని మంత్రి కేటీఆర్ తో మాట్లాడించేందుకు మంత్రి వారిని హైదరాబాద్ కు తీసుకెళ్లినట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్ తో జరిగిన భేటీలోనూ అసమ్మతి లీడర్లు మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే తమతో వ్యవహరించిన తీరును ఏకరువు పెట్టారని సమాచారం. రవిశంకర్ టికెట్ మార్చకపోతే చొప్పదండిలో ఓడిపోతామని తెగేసి చెప్పినట్లు తెలిసింది.
దీంతో స్పందించిన మంత్రి.. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, మహిళా బిల్లు పాసయితే మారవచ్చని, పార్టీ అధినేత ఎవరికి టికెట్ కన్ఫం చేస్తే వారి కోసం పనిచేయాలని నచ్చజెప్పినట్లు సమాచారం. కేటీఆర్ సూచనలు విన్న తర్వాత అభ్యర్థిపై వ్యతిరేకత ఉన్నా పార్టీ కోసం తాము పని చేస్తామని చెప్పినట్లు కేటీఆర్ ను కలిసిన లీడర్ ఒకరు వెల్లడించారు. కాగా, మంత్రి కేటీఆర్ ను కలిసినవారిలో చొప్పదండి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బీఆర్ఎస్ లీడర్ బండపల్లి యాదగిరితోపాటు గంగాధర జెడ్పీటీసీ భర్త పుల్కం నర్సయ్య, జోగినపల్లి ప్రేమ్ సాగర్ రావు, గంగాధర పీఏసీఎస్ చైర్మన్ బాలాగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.