బెట్టింగ్ యాప్స్ కేసులో సంచలనం: సచిన్, విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్‎పై పంజాగుట్ట పీఎస్‎లో ఫిర్యాదు

బెట్టింగ్ యాప్స్ కేసులో సంచలనం: సచిన్, విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్‎పై పంజాగుట్ట పీఎస్‎లో ఫిర్యాదు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. స్టార్ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బాద్‎షా షారుక్ ఖాన్‎పై అర్జున్ గౌడ్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశాడు. వీరంతా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశారని.. వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులకు కంప్లైంట్ చేసిన అనంతరం అర్జున్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‎పై ఫిర్యాదు చేశానని తెలిపాడు.

A23, ఛలో సాత్ కేలో, ఫస్ట్ గేమ్స్ వంటి బెట్టింగ్ యాపులకు వీరు ప్రచారం చేశారన్నాడు. చిన్న చిన్న వాళ్లపైనే కాకుండా పెద్ద వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని.. పెద్ద పెద్ద యాడ్స్ చేసి కోట్లు సంపాదిస్తున్న టాప్ సెలబ్రెటీలపైన కూడా కేసులు నమోదు చెయ్యాలని కోరాడు. నా స్నేహితులు చాలా మంది బెట్టింగ్ యాప్‎లో నష్టపోయి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందాడు. ఒక సిటిజన్‎గా సామాజిక బాధ్యతతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రెటీలపై ఫిర్యాదు చేశానని పేర్కొన్నాడు. 

ALSO READ | బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక మలుపు.. 19 మంది బెట్టింగ్‌ యాప్‌ల ఓనర్లపై కేసులు నమోదు

కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‎పై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న సినీ సెలబ్రెటీలు, యూట్యూబర్లు, ఇన్‎ప్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే బాలకృష్ణ, విజయదేవరకొండ, ప్రభాస్, మంచు లక్ష్మి, విష్ణు ప్రియ, నిధి అగర్వాల్, యాంకర్ శ్యామల, సుప్రియ, రీతు చౌదరి, టెస్టీ తేజ, భయ్యా సన్నీ యాదవ్ వంటి పలువురిపై కేసులు ఫైల్ చేశారు. 

ఇందులో ఇప్పటికే పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారించారు. మరికొందరికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో కోహ్లీ, సచిన్, షారుఖ్ ఖాన్ వంటి నేషనల్ సెలబ్రెటీస్‎పై   ఫిర్యాదు చేయడం సంచనలంగా మారింది. మరీ.. అర్జున్ గౌడ్ ఫిర్యాదు మేరకు సచిన్, కోహ్లీ, షారుఖ్ ఖాన్‎పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చర్యలు తీసుకుంటారా..? బిగ్ షాట్స్ కావడంతో ఆచీతూచీ వ్యవహారిస్తారా..? అనేది ఉత్కంఠ రేపుతోంది.