మంత్రి కేటీఆర్​పై హెచ్​ఆర్సీకి ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు:పిల్లల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని, వారిని బానిసల్లాగా చూస్తున్నదని కాంగ్రెస్​ నేతలు మండిపడ్డా రు. సోమవారం కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్​ జిల్లాలోని గంగాధరలో ఉన్న జ్యోతిబాపూలే గురుకుల స్కూల్ విద్యార్థులను.. హ్యాపీ బర్త్​ డే కేటీఆర్ అనే ఆకారంలో కూర్చోబెట్టి విషెస్​ చెప్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ నేతలు మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. 

ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్​ మెప్పు పొందేందుకు స్థానిక బీఆర్​ఎస్ నేతలు దిగజారుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిందిగా  కమిషన్​ను కోరామన్నారు. ఈ ఘటనపై నేషనల్ చిల్డ్రన్ కమిషన్​కూ ఫిర్యాదు చేస్తామని దరిపల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.