శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేశారంటూ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్ధారం గ్రామంలో మునగాల కృష్ణారావు అనే వ్యక్తి గుడి పేరిట.. 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలతోనే కబ్జాకు పాల్పడ్డారంటూ కృష్ణారావు పై ఆరోపణలు చేశారు. గ్రామ పంచాయతీ తీర్మానం, కలెక్టర్ ఆదేశాలు సైతం పట్టించుకోకుండా అక్రమ నిర్మాణం చేపట్టారని సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కబ్జాదారుని వెనుక నిరంజన్ రెడ్డి ఉండటంతోనే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు.
గుడి నిర్మాణం పేరుతో శ్మశానానికి చెందిన భూమిలో ఫామ్ హౌస్ కడుతున్నారని బుద్ధారం గ్రామ ప్రజలు ఆరోపించారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వం కేటాయించిన శ్మశానవాటిక స్థలంలో నిర్మాణాలు చేపడుతున్న కృష్ణారావుతో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, సర్పంచ్ మానవ హక్కుల కమిషన్ ను వేడుకున్నారు.