గంగి గోవు ప్యూర్ పాలు గరిటెడైనా చాలు.. కడివెడైనా నేమి కల్తీ పాలు.. ఏందీ.. పద్యం తప్పుగా చదివారనుకుంటున్నారా? నిజమేనండీ.. స్వచ్ఛమైన పాలను కూడా కల్తీ చేస్తే.. పద్యం ఇలాగే మార్చి చదవాల్సి వస్తుందేమో.. గోమాత పాలను కూడా కల్తీ చేస్తూ విక్రయిస్తున్న ఘటన తాజాగా హైదరాబాద్లో జరిగింది.
అది కూడా ఓ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కే అమ్మడం గమనార్హం.. కల్తీ జరిగిన విషయం ఎలా బయటపడిందో తెలిస్తే మీరు నిర్ఘాంతపోతారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ ఐఏఎస్ఆఫీసర్ ఎస్కే సిన్హా(69) జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్నారు.
ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. అవయవ మార్పిడి చేసుకున్న వారికి కాల్షియం అధికంగా ఉండే పాలు తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. దీంతో ఆయన ఓ ఆవు యజమానిని సంప్రదించి రోజూ ఇంటికే పాలసరఫరా చేయించుకున్నారు. ఇటీవల ఆవు గర్భం దాల్చింది. దీంతో ఆయన ఇంటికి పాలు తీసుకొచ్చే యజమాని పాలు వేయడం మానేశాడు.
చేసేదేమీ లేక.. సిన్హా 'మూలరస' మిల్క్ పేరుతో బాటిళ్లలో అమ్ముతున్న ఆవు పాలను ఆశ్రయించారు. లీటరుకు రూ.150 చెల్లించి మరీ పాలను కొనడం ప్రారంభించారు. కొన్నాళ్లకు ఆయన శరీరంలో మార్పులు రావడం గమనించారు. తన పాదాలపై దురద రావడాన్ని సాధారణమైందిగా భావించి నిర్లక్ష్యం చేశారు.
రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. రెండు పాదాల్లో చెడు ద్రవాలు పేరుకుపోవడం ప్రారంభించాయి. వెన్నునొప్పి స్టార్ట్ అయింది. మూలరస మిల్క్ తాగిన ప్రతి సారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువయ్యేది. పాల నాణ్యతలో అనుమానం వచ్చి సరఫరా ఆపాలని మూలరస యజమానిని ఆదేశించారు.
ప్రమాదకర కెమికల్స్ పాలల్లో కలిపి కల్తీ చేసినట్లు గుర్తించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాల కల్తీ, ప్రమాదకర రసాయనాలు పాలల్లో కలిపి ఒకరి ప్రాణాల మీదకు తెచ్చారన్న నేరంపై మూలరస యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ అధికారికే కల్తీ పాలు అమ్మారంటే సామాన్యుల సంగతేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.