పలుకుబడి ఉంటేనే పర్మిషన్ .. ఇష్టారాజ్యంగా ఇంటి పర్మిషన్లు

  •     బల్దియాలో ప్లానర్ లదే హవా
  •     పలుకుబడి ఉంటేనే పర్మిషన్ 
  •     టౌన్ ప్లానింగ్ సెక్షన్ పై  బీజేపీ నాయకుల ఫిర్యాదు 

రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 2023‌‌‌‌–-24 ఆర్థిక సంవత్సరంలో నూతన బిల్డింగ్ ల నిర్మాణానికి ఇప్పటివరకు 402 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో అధికారులు 328 నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారు. ఇంకా 44 అప్లికేషన్లు ప్రాసెస్ లో ఉన్నాయి. 30 దరఖాస్తులను తిరస్కరించారు. 2021 నుంచి  ఇప్పటివరకు 1634 దరఖాస్తులు రాగా, అందులో 1387 దరఖాస్తులకు అనుమతిలిచ్చారు. కేవలం 247 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. అనుమతిలిచ్చిన 1387 దరఖాస్తుల్లో పలుకుబడి ఉన్నా నాయకులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

బీఆర్ఎస్  నాయకుల అండ ఉంటే చాలు సిరిసిల్ల బల్దియాలో పనైతుందన్న టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో పేరున్న  నాయకుల చేతివాటంతో ఇష్టారీతిన పర్మిషన్లు తీసుకుని భవనాల నిర్మాణాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. మున్సిపల్ లో ని ఓ అధికారి కొంతమంది నాయకులకు కొమ్ముకాస్తూ నిబంధనలు పాటించకుండా అనుమతులిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సదరు అధికారిపై బీజేపీ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

ప్రైవేట్ ప్లానర్ల జిమ్మిక్కు.. 

సిరిసిల్ల బల్దియాలో ప్రైవేటు ప్లానర్ల జిమ్మిక్కులు కొనసాగుతున్నాయి. ఇంటి నిర్మాణానికి పర్మిషన్ కావాలంటే ఈ ప్రైవేట్​ప్లానర్లతో ప్లానింగ్ చేయించి సంబంధిత యజమానితో మున్సిపల్ కు అప్లికేషన్ పెట్టుకుంటారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 13 మంది లైసెన్స్ ఉన్న పట్టణ ప్లానర్లు ఉన్నారు. అయితే, ఈ ప్లానర్ రూపొందించిన బిల్డింగ్ నిర్మాణ దరఖాస్తులను మున్సిపల్ అధికారులు ఫీల్డ్ లెవల్ లో పరిశీలించి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కొందరు ఆఫీసర్ల చేతులు తడిపితే చాలు పర్మిషన్లు ఈజీగా వస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి.

పలుకుబడి, డబ్బు ఉన్న నాయకుల పైరవీలు పని చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పట్టణంలో ఓ ప్లానర్ బిల్డింగ్​ నిర్మాణానికి సంబంధించి ప్లానింగ్ దరఖాస్తును  అధికారులు తిరస్కరించారు. అదే దరఖాస్తును ఓ సీనియర్ ప్లానర్ రూపొందిస్తే వెంటనే అనుమతులు లభించాయి. ఇక్కడ కొలతలు, స్థలం మారలేదు. కానీ, ప్లానర్ మారితే ఇంటి పర్మిషన్ వచ్చింది. 

అధికారులు నోటీసులకే పరిమితం..

సిరిసిల్ల బల్దియాలో గత ప్రభుత్వ పెద్దల పైరవీలు నడుస్తున్నాయి. ఇంటి పర్మిషన్ కు వీరి పలుకుబడి పని చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన బిల్డింగ్​లకు కేవలం నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. పలుకుబడి ఉన్న ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా నిర్మించిన బిల్డింగ్ లపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి బిల్డింగ్ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

 రూల్స్ పాటిస్తున్నాం..

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్లానర్లు మొత్తం 25 మంది ఉన్నారు. వీరి తయారు చేసిన హౌజింగ్ ప్లానింగ్ లను పరిశీలించే అనుమతులిస్తున్నాం. టౌన్ ప్లానింగ్ లో ఎలాంటి పక్షపాతం లేదు. నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఇన్​ స్టంట్ రిజిస్ట్రేషన్, ఇన్ స్టంట్ అప్రూవల్ పర్మిషన్లలో  నేరుగా అప్లికెంట్స్ అప్లయ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈజీగా పర్మిషన్ లభిస్తోంది. టౌన్ ప్లానింగ్ లో ఎలాంటి అక్రమాలు లేవు.    

- అన్సారీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సిరిసిల్ల మున్సిపల్