బీఆర్ఎస్​లో అసమ్మతి సెగలు.. సర్పంచులతోనే ఎమ్మెల్యేకు దెబ్బ

  • సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇయ్యొద్దని సర్పంచుల ఫిర్యాదులు
  • భూపాల్ రెడ్డి వర్సెస్ శ్రీనివాస్ గౌడ్ గా రచ్చకెక్కుతున్న రాజకీయం

సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ లీడర్, పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అధినేత విగ్రం శ్రీనివాస్ గౌడ్ మధ్య పొలిటికల్ వార్​ ముదురుతోంది. నియోజకవర్గంలో ఇంతకాలం మంత్రి హరీశ్​రావు అండదండలతో భూపాల్ రెడ్డి ఎదురులేని రాజకీయాన్ని నడిపించారు. కానీ ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ రూపంలో ఆయనకు అసమ్మతి ఎదురవుతోంది. 

సర్పంచులతోనే ఎమ్మెల్యేకు దెబ్బ 

సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై సర్పంచులు వ్యతిరేకత రాగం వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ ఇయ్యొద్దంటున్న సర్పంచులు దివంగత నేత విగ్రం రామాగౌడ్ తనయుడు శ్రీనివాస్ గౌడ్ పేరును ప్రతిపాదిస్తున్నారు.  గ్రామ పంచాయతీలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయంలో ఎమ్మెల్యే సహకరించడం లేదని కొందరు సర్పంచులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. బిల్లులు అందక ఉన్న ఆస్తులు అమ్ముకుని అప్పులు తీర్చుకున్న సర్పంచులు ఉన్నారు. సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్ పూర్ బీఆర్ఎస్ సర్పంచ్ ఆసం దిగంబర్ డెవలప్​మెంట్ బిల్లులు అందక సొంత డబ్బులు ఖర్చు చేసి ఆర్థికంగా దెబ్బతిన్నాడు. మనస్తాపం చెందిన దిగంబర్ గత ఫిబ్రవరిలో సర్పంచ్ పదవికి రాజీనామా చేసి కలెక్టర్, డీపీవోలకు రాజీనామా లెటర్ ఇచ్చి పది రోజుల తర్వాత సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. 

ALSO READ :హనుమకొండ-ములుగు జాతీయ రహదారిపై ఉధృతంగా వరద 

ఈ ఘటన నియోజకవర్గంలోని సర్పంచులను తీవ్రంగా కలచివేసింది. ఇది ఎమ్మెల్యేకు మైనస్ అవుతోంది. పైగా మండల స్థాయి లీడర్లలో ఎమ్మెల్యే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు భూపాల్​ రెడ్డికి ప్రత్యామ్నాయ నేత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ గౌడ్ పేరును తెరపైకి తెచ్చినట్లు తెలిసింది.   ఇదిలా ఉండగా ఖేడ్ నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతి సెగలపై పార్టీ హైకమాండ్​ దృష్టి సారించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈసారి శ్రీనివాస్ గౌడ్ కు చాన్స్ వస్తుందని ఆయన వర్గీయులు అంటుండగా, మూడోసారి కూడా భూపాల్​రెడ్డికే టికెట్ వస్తుందని ఎమ్మెల్యే వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఖేడ్​ బీఆర్​ఎస్​లో భూపాల్​రెడ్డి వర్సెస్​ శ్రీనివాస్​ గౌడ్​గా రాజకీయం మారుతున్నట్లు కనిపిస్తోంది.